
ఇస్లామాబాద్: ఆసియా కప్‌లో పాకిస్థాన్ పేసర్ హారిస్ రవూఫ్ ‘6-0’అని సంజ్ఞ చేయడం వివాదస్పదంగా మారింది. అయితే, హారిస్ రవూస్ అలా సంజ్ఞ చేయడాన్ని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ సమర్ధించాడు. భారత్‌తో అలా వ్యవహరించడం సరైందేనంటూ ట్వీట్ చేశాడు.
‘హారిస్ రవూఫ్ వారితో సరిగ్గా వ్యవహరిస్తున్నావు. దీన్ని ఇలాగే కొనసాగించండి. భారత్ 6-0ని మరచిపోదు. ప్రపంచం కూడా గుర్తుంచుకుంటుంది’ అంటూ ట్వీట్ చేశారు.
గత ఆదివారం జరిగిన ఆసియా కప్ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్ చెలరేగి బ్యాటింగ్‌తో పాక్ బౌలర్లకు చుక్కలు చూపించారు. ఒకానొక సమయంలో భారత్ బ్యాట్స్‌మెన్ దెబ్బకు పాక్ పేసర్ హారిస్ రవూఫ్ సహనం కోల్పోయి.. ‘6-0’ సంకేతంతో విమానాలు కూలుతున్నట్లు సంజ్ఞ చేశాడు.
ఈ సంకేతానికి కారణంగా పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్. ఆపరేషన్ సిందూర్‌కు ప్రతిగా వారు భారత ఆరు ఫైటర్ జెట్‌లను కూల్చేశారట. కానీ, ఆ ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో అంతర్జాతీయ వేదికలపై పాక్ పరువు పోగొట్టుకుంటోందన్న విమర్శలు ఉన్నాయి.
ఈ సంఘటనపై పాక్ కాలమిస్ట్ అయాబ్ అహ్మద్ చేసిన పోస్ట్‌ను ఖవాజా ఆసిఫ్ రీపోస్టు చేస్తూ కామెంట్స్ చేశారు. జెంటిల్‌మెన్ గేమ్ ఇలాంటి సంజ్ఞలు క్రీడా ఆచారాలకు విరుద్ధమని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.