కన్నీళ్లు పెట్టుకున్న ఒబామా | Barack Obama Gets Emotional By His Wife Michelles Speech At Obama Presidential Center Launch In Chicago | Sakshi
Sakshi News home page

కన్నీళ్లు పెట్టుకున్న ఒబామా

Jun 20 2026 2:33 AM | Updated on Jun 20 2026 12:37 PM

Obama moved to tears by wife Michelles speech

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా తాజాగా ఓ సందర్భంలో తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. చికాగోలో నూతనంగా నిర్మించిన ఒబామా ప్రెసిడెన్షియల్ సెంటర్ ప్రారంభోత్సవ వేడుకలో తన భార్య మిషెల్ ప్రసంగిస్తుండగా ఒబామా కళ్లలో నీళ్లు తిరిగాయి. ఆయన కన్నీళ్లు తుడుచుకుంటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

చికాగో నగరంలోని జాక్సన్ పార్క్‌లో నిర్మించిన ఈ ప్రెసిడెన్షియల్ సెంటర్ ఒబామా దంపతులు వైట్‌హౌస్‌లో గడిపిన ఎనిమిదేళ్ల పాలనకు గుర్తుగా ఏర్పాటు చేశారు. పదేళ్లుగా రూపుదిద్దుకుంటున్న ఈ ప్రాజెక్టు చివరకు ప్రజలకు అందుబాటులోకి వచ్చింది.

బరాక్.. నా వైపు చూడండి..!
ప్రసంగంలో మిషెల్ తన భర్తను ఉద్దేశించి, "బరాక్.. నా వైపు చూడండి" అని చెప్పడంతో సభలో నవ్వులు పూశాయి. అనంతరం ఆయన అధ్యక్షుడిగా ఎదుర్కొన్న ఒత్తిడులు, సవాళ్లను మిషెల్‌ గుర్తుచేశారు.

"ఎనిమిదేళ్లపాటు తీవ్రమైన ఒత్తిళ్లు ఎదురైనా ఒక్కసారి కూడా మీరు తడబడలేదు. దేశ ప్రజల కోసం పనిచేశారు" అంటూ కొనియాడారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ, ఆరోగ్య సంరక్షణ విస్తరణ, లాడెన్‌ హత్యకు దారితీసిన ఆపరేషన్, అలాగే నోబెల్ శాంతి బహుమతి వంటి అంశాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు.

మిషెల్ ప్రసంగం అనంతరం మాట్లాడిన ఒబామా, ఆమె నన్ను భావోద్వేగానికి గురి చేస్తుందని ముందే తెలుసని అన్నారు.

ట్రంప్‌పై పరోక్ష విమర్శ
మిషెల్ నోబెల్ శాంతి బహుమతి విషయం ప్రస్తావించడం ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పై పరోక్ష విమర్శగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ట్రంప్ కూడా గతంలో నోబెల్ శాంతి బహుమతి పొందాలనే ఆసక్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

ఈ కార్యక్రమానికి మాజీ అధ్యక్షులు బిల్‌ క్లింటన్‌, జార్జ్‌ బుష్‌, జో బైడెన్‌ హాజరు కాగా.. ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్‌కు మాత్రం ఆహ్వానం అందలేదని అమెరికన్ మీడియా పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement