ఆమె ఓ నర్సు. కాదు కాదు ‘అందాల నర్సు’! కలలు అందరూ కంటారు. కానీ కొందరే వాటిని నిజం చేసుకుంటారు. కువైట్‌లో నర్సుగా పనిచేస్తున్న బినీషాది అలాంటి ‘అందమైన’ కథే.
కేరళకు చెందిన బినీషాకు డ్యాన్స్, మోడలింగ్ పట్ల ఆసక్తి ఉన్నప్పటికీ, కుటుంబ పోషణ కోసం నర్సింగ్ వృత్తిని ఎంచుకుంది. కానీ ఆమె తన కలలను వదలలేదు. స్టాఫ్ నర్సుగా పని చేస్తూనే.. నృత్యం, మోడలింగ్‌లో నైపుణ్యాలను మెరుగుపరుచుకుంది. ఈ ప్రయాణంలో ఆమెకు ప్రత్యేక గుర్తింపు 2023లో మిస్ ఇండియా ఇంటర్నేషనల్ టైటిల్‌ను సాధించడం ద్వారా లభించింది.
ఇటు నర్సింగ్.. అటు మోడలింగ్
ఆరోగ్య సంరక్షణ బినీషా జీవితంలో ఒక భాగం. మోడలింగ్, డ్యాన్సింగ్ ఇతర పార్శ్వాలు. ఈ రెండు ప్రపంచాలను సమానంగా కొనసాగించడం ఆమె ప్రత్యేకత. బినీషా తన తండ్రి బాబు కుటుంబం కోసం పడిన కష్టాలను చూస్తూ పెరిగింది. పాఠశాల రోజుల నుంచే కళలపై ఆసక్తి చూపుతున్న కుమార్తె కలలను తల్లి షీలా ఎంత గానో ప్రోత్సహించింది. పాఠశాల కళల వేదికపై మెరిసినప్పటికీ, కళతో జీవితాన్ని సాగించడం కష్టమని గ్రహించిన బినీషా, వృత్తిపరమైన కోర్సు వైపు మొగ్గు చూపింది. అలా నర్సింగ్ చదివి పూర్తి చేసింది.
చదువు పూర్తయ్యాక, నాలుగేళ్ల పాటు ఐసీయూ నర్సుగా పనిచేసింది. అదే సమయంలో, గ్లామ్ గైడెన్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన మిస్ ఇండియా ఇంటర్నేషనల్ 2023 పోటీలో కేరళకు ప్రాతినిధ్యం వహించిన బినీషా.. దాదాపు 40 మంది పోటీదారుల దాటుకుని టైటిల్ గెలిచింది. ఇప్పుడు తన సోదరి అలీషా చదువులను కూడా బినీషానే చూసుకుంటోంది.


