
ఢాకా: బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారు ముహమ్మద్ యూనస్ భారత్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. తమ దేశంలో హిందువులపై ఏమాత్రం హింస జరగడం లేదని, అయితే భారత్ దీనికి భిన్నంగా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నదని ఆరోపించారు. గత ఏదాది షేక్ హసీనా ప్రభుత్వ పతనం తర్వాత హిందువులపై మత పరమైన హింస జరిగిందంటూ వచ్చిన పలు అంతర్జాతీయ నివేదికలను ముహమ్మద్ యూనస్ తోసిపుచ్చారు. అవి భారతదేశం ప్రచురించిన అబద్ధపు వార్తలని పేర్కొన్నారు.
ఇటీవల యూఎస్ జర్నలిస్ట్ మెహదీ హసన్‌తో జరిగిన ఇంటర్వ్యూలో పాల్గొన్న ముహమ్మద్ యూనస్.. భూ విభజన, ఇతర స్థానిక సమస్యలపై పొరుగువారితో సాధారణ ఘర్షణలు ఉన్నాయని, అయితే వీటిని మతపరంగా చిత్రీకరించకూడదన్నారు. భారతదేశం ఎల్లప్పుడూ ఫేక్ వార్తలలో ఒత్తిడి తెస్తున్నదని, అందుకే వీటిపై తమ ప్రభుత్వం చాలా అప్రమత్తంగా ఉందని ఆయన పేర్కొన్నారు. హసీనా పదవీచ్యుతురాలైన వెంటనే తమ దేశంలో మతపరమైన సంఘటనలకు సంబంధించిన నివేదికలు ప్రపంచవ్యాప్తంగా ముఖ్యాంశాలుగా మారాయన్నారు. హిందువుల విషయంలో యూనస్ ప్రభుత్వం వ్యవహరించిన తీరును అనాగరికమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా విమర్శించారని ఆయన గుర్తు చేశారు.
గత నవంబర్‌లో దాదాపు 30 వేల మంది హిందువులు ఢాకా వీధుల్లో ర్యాలీ చేపట్టి, తమపై జరుగుతున్న దాడుల నుంచి యూనస్ ప్రభుత్వం రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే హిందూ నాయకులపై ఉన్న దేశద్రోహ అభియోగాలను ఉపసంహరించుకోవాలని కూడా వారు కోరారు. మరోవైపు చిన్మోయ్ కృష్ణ దాస్ అరెస్టు పలువురు భారతీయులలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. కాగా బంగ్లాదేశ్‌లోని హిందువులు తమను తాము హిందువులుగా కాకుండా బంగ్లాదేశ్ పౌరులుగా భావించాలని యూనస్ విజ్ఞప్తి చేశారు.