ఇరాన్‌పై యుద్ధం.. ట్రంప్‌ను లైట్‌ తీసుకున్న నెతన్యాహు? | Netanyahu Was In Dark About Trump Iran Plans | Sakshi
Sakshi News home page

ఇరాన్‌పై యుద్ధం.. ట్రంప్‌ను లైట్‌ తీసుకున్న నెతన్యాహు?

Jun 12 2026 2:00 PM | Updated on Jun 12 2026 2:52 PM

Netanyahu Was In Dark About Trump Iran Plans

జెరూసేలం: ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ వ్యూహాల మధ్య తీవ్రమైన వ్యత్యాసాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న కొన్ని కీలక నిర్ణయాల గురించి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు ముందే సమాచారం లేకపోవడం, ఆయనను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ పరిణామాలు పశ్చిమాసియాలో అమెరికాకు ఉన్న తిరుగులేని శక్తి పరిమితులను బహిర్గతం చేస్తున్నాయని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇటీవల ఇరాన్ జరిపిన క్షిపణి దాడుల తర్వాత, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేరుగా నెతన్యాహుతో మాట్లాడారు. ఇరాన్‌తో తాము జరుపుతున్న అణు చర్చలు దెబ్బతినకూడదనే ఉద్దేశంతో ప్రతీకార దాడులకు వెళ్లవద్దని ఆయన ఇజ్రాయెల్‌ను కోరారు. అయితే, ఈ విజ్ఞప్తిని లైట్‌ తీసుకుంది. కొన్ని గంటల్లోనే ఇజ్రాయెల్ వైమానిక దళం ఇరాన్‌లోని వ్యూహాత్మక సైనిక స్థావరాలపై దాడులు చేసింది. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించాలనే ట్రంప్ ప్రయత్నాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

ఈ పరిణామాలపై అమెరికా సెనేటర్ క్రిస్ మర్ఫీ తీవ్రంగా స్పందించారు. ఇది అమెరికా అగ్రరాజ్య హోదాకు, దాని శక్తికి అవమానకరం. దాడి చేయవద్దని అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా నెతన్యాహును కోరినప్పటికీ, ఇజ్రాయెల్ వెనుకాడకుండా దాడికి తెగబడింది. ఇది పశ్చిమాసియాలో అమెరికా ప్రభావం ఎంతలా తగ్గిపోయిందో స్పష్టం చేస్తోంది’ అని ఆయన వ్యాఖ్యానించారు.

ఈ క్రమంలో ఇరాన్‌తో త్వరలోనే ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదురుతుందని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. సోమవారం లేదా మంగళవారంలోగా సంతకాలు జరుగుతాయి అని కూడా ఆయన ప్రకటించారు. ఇరాన్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ..‘మీరు క్షిపణులు ప్రయోగించారు. ఇక చాలు. ఇప్పుడు చర్చలకి రండి’ అని పిలుపునిచ్చారు. కానీ, ఇజ్రాయెల్ జరిపిన తాజా వైమానిక దాడులు ఈ చర్చల ప్రక్రియను మరింత సంక్లిష్టం చేశాయి.

మరోవైపు, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు దృక్పథం పూర్తిగా భిన్నంగా ఉంది.ఇరాన్ అణు ప్రణాళికలు,క్షిపణి సామర్థ్యాల విస్తరణ, ప్రాంతీయ ఉగ్రవాద సంస్థలకు ఇరాన్ ఇస్తున్న మద్దతు..వీటన్నింటినీ ఇజ్రాయెల్ తన దేశ అస్తిత్వానికే ముప్పుగా భావిస్తోంది. అమెరికా కుదుర్చుకునే తాత్కాలిక దౌత్య ఒప్పందాలు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపలేవని నెతన్యాహు నమ్ముతున్నారు.

ఈ పరిణామాలు సాంప్రదాయ మిత్రదేశాలైన అమెరికా–ఇజ్రాయెల్ సంబంధాలలో కొత్త ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. డొనాల్డ్ ట్రంప్ తనను తాను ఒక ‘ప్రపంచ శాంతి దూత’గా నిరూపించుకోవాలని గట్టిగా ప్రయత్నిస్తున్నప్పటికీ, ఇజ్రాయెల్ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడం ఆయన ఇమేజ్‌కు భంగం కలిగిస్తోంది. ఒకవేళ ఇరాన్‌తో అమెరికా ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ, ఇజ్రాయెల్ దానిని అంగీకరించేలా లేదనే అభిప్రాయం అంతర్జాతీయ సమాజంలో బలంగా వ్యక్తమవుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement