నేపాల్ రాజకీయాలలో ఒక కొత్త శకానికి నాంది పలికేందుకు రంగం సిద్దమైంది. ఆ దేశ సార్వత్రిక ఎన్నికలు మార్చి 5న జరగనున్నాయి. అయితే ఈ సాధారణ ఎన్నికల కోసం మంగళవారం(జనవరి 20)తో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది.
ప్రత్యక్ష ఎన్నికల విధానం (FPTP) కింద ఉన్న 165 సీట్ల కోసం 3,500 మందికి పైగా అభ్యర్థులు నామినేషన్ వేశారు. ఇందులో సుమారు 400 మంది మహిళా అభ్యర్థులు ఉండడం గమనార్హం. కాగా నేపాల్ ప్రతినిధుల సభలో మొత్తం 275 సీట్లు ఉంటాయి. ఇందులో 165 సీట్లకు ప్రత్యక్షంగా, మిగిలిన 110 సీట్లకు దామాషా పద్ధతిలో ఎన్నికలు జరుగుతాయి.
గగన్ థాపా నేతృత్వంలోని నేపాలీ కాంగ్రెస్, రబీ లామిచానే నేతృత్వంలోని రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ మధ్య తీవ్ర పోటీ నెలకొనే అవకాశముంది. గత సెప్టెంబర్‌లో జెన్ జెడ్ యువత నిరసనల తర్వాత నేపాల్ రాజకీయాల్లో పెను మార్పులు వచ్చిన సంగతి తెలిసిందే.
దీంతో నేపాలీ కాంగ్రెస్ వంటి పార్టీలు ఈసారి పెద్ద సంఖ్యలో కొత్తవారికి అవకాశమిచ్చాయి. నేపాలీ కాంగ్రెస్ తన 165 స్థానాల్లో 106 స్థానాలను కొత్తవారికే కేటాయించింది. మాజీ ప్రధానులు కె.పి. శర్మ ఓలీ, పుష్ప కమల్ దహల్ 'ప్రచండ', మాధవ్ కుమార్ వంటి వారు పోటీలో ఉన్నారు. ముఖ్యంగా ఈసారి ఖట్మండు మాజీ మేయర్ బాలేంద్ర షాపై అందరి కళ్లు ఉన్నాయి.
కె.పి. శర్మ ఓలీకి వ్యతిరేకంగా ఝాపా-5 నియోజకవర్గం నుండి బాలేంద్ర షా పోటీచేయనున్నాడు. నేపాల్‌లో అతడికి మంచి ఫాలోయింగ్ ఉంది. అందరూ అతడిని ముద్దుగా 'బాలెన్ షా' పిలుచుకుంటారు. 2022లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బాలెన్ షా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఖట్మండు మహానగరానికి మేయర్‌గా ఎన్నికై సంచలనం సృష్టించాడు. ఇప్పుడు తన పదవికి రాజీనామా చేసి పార్లమెంట్ ఎన్నికలలో బరిలోకి దిగాడు. కాగా ఈ ఎన్నికలలో సుమారు 1.9 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.


