
లాహోర్: పహల్గాం అమానవీయ ఉగ్రదాడి ఘటనను ప్రపంచ దేశాలు ఖండించాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల సమసిపోవాలంటే దౌత్య మార్గాల ద్వారానే పరిష్కరించుకోవాలని తమ్ముడు, పాక్ ప్రధాని షెహబాజ్‌కు నవాజ్ సలహా ఇచ్చారు.
పాకిస్తాన్ స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం.. లాహోర్‌లో నవాజ్ షరీఫ్‌తో షహబాజ్ ఆదివారం భేటీ అయ్యారు. పహల్గాం దాడి తర్వాత భారత్ తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా తన ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ఆయనకు వివరించారు. సింధూ నదీజలాల ఒప్పందం నుంచి భారత్ వైదొలిగిన విషయాలను వెల్లడించారు. భారత్ తీరు వల్లే ఉద్రిక్తతలు పెరిగాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నవాజ్ షరీఫ్ స్పందించి.. దూకుడుగా వ్యవహరించకుండా, భారత్‌తో శాంతి పునరుద్ధరణ కోసం అందుబాటులో ఉన్న అన్ని దౌత్య మార్గాలను వినియోగించుకోవాలని తన తమ్ముడికి సూచించినట్టు చెప్పుకొచ్చింది. మరోవైపు.. షరీఫ్ కుమార్తె, పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి మర్యమ్ సైతం ఇంతవరకు ఉగ్రదాడి ఘటనను ఖండిస్తూ ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు.
ఇదిలా ఉండగా.. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ విషయంలో భారత్ కఠిన చర్యలు తీసుకుంది. దీనిపై దాయాది దేశం అక్కసు వెళ్లగక్కుతోంది. ఈ పరిణామాల నడుమ పాకిస్తాన్(Pakistan) రక్షణశాఖ మంత్రి ఖవాజా మహమ్మద్ ఆసిఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పహల్గాం ఘటన నేపథ్యంలో భారత్ ప్రతీకార దాడి చేపడుతుందని, త్వరలోనే ఇది జరిగే అవకాశం ఉందని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రతీకార దాడి జరగనున్న విషయం కాబట్టి.. మా బలగాలను అప్రమత్తం చేశాం. దాడుల జరిగే పరిస్థితుల్లో కొన్ని వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆ మేరకు చర్యలు తీసుకున్నామని అన్నారు. అయితే, తన అంచనాలకు దారి తీసిన వివరాలను మాత్రం ఆయన వెల్లడించలేదు. భారత్ దాడులకు పాల్పడే అవకాశం ఉందని తమ సైన్యం ప్రభుత్వానికి వివరించిందని తెలిపారు. ఈ విషయమై పాక్ అత్యంత అప్రమత్తంగా ఉందని, తమ ఉనికికి ప్రత్యక్ష ముప్పు ఉందని భావిస్తే అణ్వాయుధాలను ప్రయోగిస్తామని పేర్కొన్నారు.