శాంతి వైపే భారత్‌  | Sakshi
Sakshi News home page

శాంతి వైపే భారత్‌ 

Published Wed, Jun 21 2023 4:31 AM

Narendra Modi reacts on Russia Ukraine conflict - Sakshi

న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌–రష్యా యుద్ధంపై భారత్‌ తటస్థంగా వ్యవహరిస్తోందని కొందరు చెబుతున్నారని, అందులో ఎంతమాత్రం నిజం లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తేల్చిచెప్పారు. తాము తటస్థంగా లేమని, శాంతి వైపే ఉన్నామని స్పష్టం చేశారు. అంతర్జాతీయ చట్టాలు, ఇతర దేశాల సార్వబౌమత్వాన్ని ప్రపంచదేశాలన్నీ గౌరవించాల్సిందేనని అన్నారు. అంతర్జాతీయ వేదికపై మరింత సమున్నత పాత్ర పోషించే అర్హత భారత్‌కు ఉందని వ్యాఖ్యానించారు. అగ్రరాజ్యం అమెరికాతో భారత్‌ సంబంధాలు గతంలో ఎన్నడూ లేనంత బలంగా ఇప్పుడు ఉన్నాయని చెప్పారు.

అమెరికా పర్యటన సందర్భంగా మోదీ మంగళవారం ప్రఖ్యాత ‘వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌’ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. పలు కీలక అంశాలను ప్రస్తావించారు. ఇతర ఏ దేశానికీ భారత్‌ ప్రత్యామ్నాయం కాదని స్పష్టం చేశారు. ప్రపంచంలో తమకు దక్కాల్సిన సరైన స్థానం సంపాదించడానికి కృషి చేస్తున్నామని అన్నారు. భారత్‌–చైనా సంబంధాలపై మాట్లాడుతూ.. ఇరుదేశాల మధ్య సాధారణ సంబంధాలు కొనసాగాలంటే సరిహద్దుల్లో శాంతియుత పరిస్థితులు నెలకొనడం తప్పనిసరన్నారు.

ఇతర దేశాల సార్వ¿ౌమత్వం, ప్రాదేశిక సమగ్రతను గౌరవిస్తామన్నారు. భేదాభిప్రాయాలను, వివాదాలను చట్టబద్ధ పాలన ద్వారా శాంతియుతంగా పరిష్కరించుకోవాలన్నదే తమ అభిమతమని ఉద్ఘాటించారు. అదేసమయంలో తమ సార్వబౌమత్వం, గౌరవాన్ని కాపాడుకోవడంలో రాజీపడే ప్రసక్తే లేదని తెలియజేశారు.  ఉక్రెయిన్‌–రష్యా ఘర్షణ నివారణకు తాము చేయాల్సిందంతా చేస్తామన్నారు.  ఉక్రెయిన్‌–రష్యా విషయంలో భారత్‌ వైఖరిని ప్రపంచం అర్థం చేసుకుందన్నారు.   భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించాల్సిన ఆవశ్యకతను ప్రధాని నొక్కిచెప్పారు.   

న్యూయార్క్‌ చేరుకున్న మోదీ 
భారత ప్రధాని మోదీ మంగళవారం న్యూయార్క్‌కు చేరుకున్నారు. అమెరికా ప్రభుత్వ ప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు. మోదీకి స్వాగతం పలకడానికి భారతీయ–అమెరికన్లు సైతం  భారీగా తరలివచ్చారు. 

భారత్‌–అమెరికా బంధం సుసంపన్నం 
భారత్‌–అమెరికా సంబంధాల్లోని వైవిధ్యం, గాఢతను మరింత సుసంపన్నం చేయడానికి తన పర్యటన దోహదపడుతుందని ఆశిస్తున్నట్లు ప్రధాని∙మోదీ వెల్లడించారు. అమెరికా ప్రభుత్వ పెద్దలతో భేటీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని చెప్పారు. ఆయన మంగళవారం ఉదయం అమెరికా పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఒక ప్రకటన విడుదల చేశారు.

ఉమ్మడి సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత్, అమెరికా కలిసికట్టుగా పని చేస్తున్నాయని తెలిపారు. అమెరికాలో పర్యటించాల్సిందిగా అధ్యక్షుడు జో బైడెన్, ప్రథమ పౌరురాలు జిల్‌ బైడెన్‌ నుంచి తనకు ప్రత్యేక ఆహ్వానం అందిందని పే ర్కొన్నారు. రెండు బలమైన ప్రజాస్వామ్య దేశాలైన భారత్‌–అమెరికా భాగస్వామ్య బలానికి, శక్తికి, తేజస్సుకు తన పర్యటన ఒక ప్రతిబింబమన్నారు.

అమెరికా పార్లమెంట్‌ అండదండలు  
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తోపాటు అక్కడి ఉన్నతాధికారులతో సమావేశం కాబోతున్నామని ప్రధాని మోదీ వివరించారు. ఇరుదేశాల నడుమ ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి ఈ చర్చలు తోడ్పడుతాయని చెప్పారు. న్యూయార్క్‌ నుంచే తన పర్యటన ప్రారంభం కాబోతోందని, ఈ నెల 21న ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో యోగా దినోత్సవంలో పాల్గొంటానని తెలిపారు.

 అమెరికా పార్లమెంట్‌ ఉభయ సభల సంయుక్త సమావేశంలో మాట్లాడబోతున్నానని వివరించారు. అమెరికా పర్యటన అనంతరం 24న ఈజిప్టుకు పయనమవుతానని మోదీ తెలిపారు. ప్రధాని మోదీ అమెరికాలో  నోబెల్‌ బహుమతి గ్రహీతలు, ఆర్థికవేత్తలు, కళాకారులు, సైంటిస్టులు,వ్యాపారవేత్తలు, విద్యావేత్తలతో సమావేశం కానున్నారు.  టెస్లా అధినేత ఎలాన్‌ మస్‌్క, రచయిత నీల్‌ డిగ్రాస్‌ టైసన్‌లను కలుసుకుంటారు.   

Advertisement
 
Advertisement