బీజేపీ–రిలయన్స్‌ లింక్‌.. మస్క్‌పై భారతీయుల ఫైర్‌! | Musks Dear PM Ambani Jab Sparks Fresh Row Over BJP Donations | Sakshi
Sakshi News home page

బీజేపీ–రిలయన్స్‌ లింక్‌.. మస్క్‌పై భారతీయుల ఫైర్‌!

Oct 10 2026 8:16 AM | Updated on Oct 10 2026 8:16 AM

Musks Dear PM Ambani Jab Sparks Fresh Row Over BJP Donations

భారత్‌లో స్టార్‌లింక్‌ సేవల ప్రవేశంపై రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్న స్పేస్‌ఎక్స్‌ అధినేత ఎలాన్‌ మస్క్‌.. తాజాగా కొత్త రచ్చకు కారణమయ్యారు. రిలయన్స్‌, దానితో సంబంధాలున్న సంస్థలు అధికార బీజేపీకి భారీగా విరాళాలు ఇచ్చాయని గుర్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన స్క్రీన్‌షాట్లను తన ఎక్స్‌ ఖాతాలో షేర్‌ చేశారు. దీంతో స్టార్‌లింక్‌ వివాదం కాస్తా.. రాజకీయ మలుపు తీసుకుంది.  

భారత్‌లో స్టార్‌లింక్‌ సేవలకు అనుమతుల విషయంలో జాప్యం జరుగుతోందంటూ ఎలాన్‌ మస్క్‌ కొంతకాలంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. భారత్‌లో గుత్తాధిపత్యం ప్రదర్శించే కొందరు స్టార్‌లింక్‌ను అడ్డుకుంటున్నారని సంచలన ఆరోపణలకు దిగారాయన. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ వాదనలను తోసిపుచ్చింది. ఉపగ్రహ ఇంటర్నెట్‌ సేవల సంస్థలు భద్రతా నిబంధనలు, నియంత్రణ ప్రమాణాలను పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. స్టార్‌లింక్‌తోపాటు ఇతర సంస్థలకూ భద్రతా అనుమతులు, స్పెక్ట్రమ్‌ కేటాయింపు వంటి అంశాలు కీలకంగా ఉన్నాయని గుర్తు చేసింది. 

రాహుల్‌ ఎంట్రీ! డియర్‌ పీఎం అంబానీ అంటూ.. 
ఆ వెంటనే ఎలాన్‌ మస్క్‌ ‘ఆ బాస్‌ అంబానీయేనా?’ అంటూ ట్వీట్‌ చేయగా దానికి కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ స్పందిస్తూ.. వెల్‌కమ్‌ టు ఇండియా మస్క్‌.. ఇంకో పేరు త్వరలోనే బయటకు వస్తుందంటూ రీట్వీట్‌ చేశారు. దానికిగానూ రాహుల్‌కు థ్యాంక్స్‌ చెప్పిన మస్క్‌.. ఇది నిజంగా భయంకరంగా ఉంది అంటూ మరో బదులు ఇచ్చారు.

ఈ నేపథ్యంలో అంబానీని ఉద్దేశిస్తూ గత రాత్రి.. ‘డియర్‌ ప్రైమ్‌ మినిస్టర్‌ అంబానీ.. భారత్‌కు అసలు బాస్‌ మీరేనని గుర్తించలేకపోయినందుకు క్షమించండి’ అంటూ వ్యంగ్యంగా పోస్టు చేశారు. భారత మార్కెట్లో స్టార్‌లింక్‌ పోటీని అనుమతించాలని కోరారు. ఇంటర్నెట్‌ సౌకర్యాలు అందని ప్రాంతాలకు తమ సేవలు చేరితే పిల్లలకు విద్యావకాశాలు, చిన్న వ్యాపారులకు ప్రయోజనం కలుగుతాయని పేర్కొన్నారు.

బీజేపీ ప్రచారానికి రిలయన్స్‌ ఫండ్స్‌..
ఇప్పుడు మస్క్‌ తాజాగా షేర్‌ చేసిన కథనాల్లో ఒకటి అల్‌జజీరా 2022 మార్చి 14న ప్రచురించిన పరిశోధనాత్మక కథనం. ‘హౌ ఏ రిలయన్స్‌-ఫండెడ్‌ ఫర్మ్‌ బూస్ట్స్‌ బీజేపీస్‌ క్యాంపెయిన్స్‌ ఆన్‌ ఫేస్‌బుక్‌’ను మస్క్‌ ఇప్పుడు షేర్‌ చేశారు. అలాగే మస్క్‌ షేర్‌ చేసిన మరో కథనం 2024 మార్చి 21న ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌లో ‘రిలయన్స్‌-లింక్డ్‌ క్విక్‌ సప్లై గేవ్‌ రూ.385 కోట్లు టు బీజేపీ, రూ.25 కోట్లు టు శివసేన’ పేరిట ప్రచురితమైంది. రిలయన్స్‌తో సంబంధాలు ఉన్న క్విక్‌ సప్లై అనే కంపెనీ బీజేపీకి వందల కోట్ల విరాళాలు ఇచ్చిందన్నది ఆ కథనం సారాంశం. 

మస్క్‌ వ్యవహారశైలిపై నెటిజన్ల ప్రశ్నలు
అంబానీని లక్ష్యంగా చేసుకుని పాత కథనాలను షేర్‌ చేస్తున్న మస్క్‌ తీరుపై కొందరు భారతీయ నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. రాజకీయ పార్టీలకు ఇలాంటి ఫండింగ్‌లు సర్వసాధారణమేని గుర్తు చేస్తున్నారు. బీజేపీకి మాత్రమే కాదని.. ఇతర పార్టీలకు కూడా అలాంటి వ్యాపారవేత్తలు విరాళాలు ఇస్తుంటారని అంటున్నారు. అంతెందుకు.. అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో డొనాల్డ్‌ ట్రంప్‌కు మద్దతుగా మస్క్‌ కూడా భారీగా ఖర్చు చేశారంటూ కొందరు అందుకు సంబంధించిన స్క్రీన్‌షాట్లను పోస్టు చేస్తున్నారు. ఇతరుల రాజకీయ సంబంధాలు, విరాళాలపై ప్రశ్నలు లేవనెత్తుతున్నప్పుడు.. తన రాజకీయ మద్దతు, ఖర్చులపైనా అదే ప్రమాణం వర్తించాలంటూ వ్యాఖ్యానిస్తున్నారు.

స్టార్‌లింక్‌ వివాదం.. రాజకీయ విరాళాల చర్చ
స్టార్‌లింక్‌ భారత మార్కెట్లోకి ప్రవేశించేందుకు అవసరమైన అనుమతులపై మొదలైన వివాదం ఇప్పుడు కార్పొరేట్‌ గుత్తాధిపత్యం, రాజకీయ పార్టీలకు అందే విరాళాలు, ఎన్నికల ప్రచారంలో సంస్థల పాత్ర వంటి విస్తృత అంశాలపై చర్చకు దారితీసింది. అంబానీపై మస్క్‌ చేసిన ‘డియర్‌ పీఎం అంబానీ’ వ్యాఖ్యకు తోడు, పాత కథనాలను ఆయన మళ్లీ షేర్‌ చేయడం.. దానికి భారతీయుల కౌంటర్‌ ఈ చర్చకు మరింత ప్రాధాన్యం తెచ్చింది. 

ఇదీ చదవండి: ఎలాన్‌ మస్క్‌పై స్టార్‌ నటుడి ఫైర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement