ఇన్‌స్టాగ్రామ్‌లో ‘మనదే’ అంతా! | G7 Summit 2026, Modi Meloni Melodi Moment Goes Viral After Light Hearted Exchange In France, Watch Video Viral | Sakshi
Sakshi News home page

ఇన్‌స్టాగ్రామ్‌లో ‘మనదే’ అంతా!

Jun 17 2026 8:42 AM | Updated on Jun 17 2026 9:39 AM

Most Famous on Instagram: Melonis Viral Remark to Modi

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, యుద్ధాలు, భద్రతా సవాళ్లు వంటి కీలక అంశాలపై చర్చించేందుకు ప్రపంచ నేతలు జీ7 సదస్సులో సమావేశమయ్యారు. అయితే అధికారిక సమావేశాల కంటే.. ఓ చిన్న సరదా సంభాషణే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ మరోసారి తమ ప్రత్యేక కెమిస్ట్రీతో వార్తల్లో నిలిచారు.

ఫ్రాన్స్‌లోని ఎవియాన్‌లో జరిగిన జీ7 సదస్సు సందర్భంగా ప్రపంచ నేతలంతా గ్రూప్‌ ఫొటో కోసం ఒకచోట చేరారు. ఈ సమయంలో మోదీ, మెలోనీ ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. "మిమ్మల్ని మళ్లీ కలవడం ఆనందంగా ఉంది" అని మెలోనీ చెబుతూ.. ఆ వెంటనే సరదాగా "ఇన్‌స్టాగ్రామ్‌లో మనమే అత్యంత ప్రసిద్ధ జంట" అంటూ చమత్కరించారు. దీనికి మోదీ చిరునవ్వుతో స్పందించగా.. ఆ వీడియో క్షణాల్లోనే వైరల్‌గా మారింది.

మీమ్‌ నుంచి గ్లోబల్‌ క్రేజ్‌ దాకా.. 
మోదీ, మెలోనీ పేర్లను కలిపి నెటిజన్లు సృష్టించిన ‘‘మెలోడీ’’ హ్యాష్‌ట్యాగ్‌ గత మూడేళ్లుగా సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. 2023లో దుబాయ్‌లో జరిగిన సీఓపీ-28 సదస్సులో మెలోనీ మోదీతో కలిసి తీసుకున్న సెల్ఫీని సోషల్ మీడియాలో పోస్ట్‌ చేస్తూ #Melodi అని క్యాప్షన్‌ ఇచ్చారు. అప్పటి నుంచి ఆ హ్యాష్‌ట్యాగ్‌ మీమ్స్‌, ఫ్యాన్‌ ఎడిట్స్‌, సరదా పోస్టులతో ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్‌ అవుతోంది.

ఇద్దరు నేతలు ఏ అంతర్జాతీయ వేదికపై కలిసినా.. మెలోడీ మళ్లీ సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతోంది. జీ7 సదస్సు కూడా అందుకు మినహాయింపు కాలేదు.

మెలోనీకి టాఫీలు!
ఈ మెలోడీ ఫినామినన్‌ను మోదీ కూడా సరదాగా గుర్తించిన సందర్భం ఇటీవలే చోటుచేసుకుంది. గత నెల రోమ్‌ పర్యటన సందర్భంగా మోదీ.. మెలోనీకి మెలోడీ టాఫీల ప్యాకెట్‌ను బహుమతిగా అందించారు. ఆ బహుమతిని చూసిన మెలోనీ నవ్వుతూ.. ప్రధాని మోదీ మాకు ఒక గిఫ్ట్‌ తీసుకొచ్చారు.. చాలా మంచి టాఫీ అంటూ వ్యాఖ్యానించారు. ఆ వీడియో సోషల్ మీడియాలో రికార్డు స్థాయిలో వైరల్‌ అయింది. గంటల వ్యవధిలోనే కోట్లాది వ్యూస్‌ సాధించి, లక్షలాది మంది నెటిజన్లను ఆకట్టుకుంది.

వైరల్‌ కెమిస్ట్రీ
అంతర్జాతీయ దౌత్య వేదికలపై సాధారణంగా గంభీర చర్చలే ఎక్కువగా కనిపిస్తాయి. కానీ మోదీ-మెలోనీ మధ్య కనిపించే ఈ సరదా సంభాషణలు మాత్రం సోషల్ మీడియా యుగంలో రాజకీయ నాయకుల ఇమేజ్‌ను కొత్త కోణంలో చూపిస్తున్నాయి. జీ7 వేదికగా మెలోనీ చేసిన "ఇన్‌స్టాగ్రామ్‌లో మనమే ఫేమస్‌ కపుల్‌" వ్యాఖ్యతో.. నెట్టింట వైరల్‌ అయ్యింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement