బ్యూనస్ ఎయిర్స్: లియోనెల్ మెస్సీ.. ప్రపంచ ఫుట్‌బాల్‌లో ఈ పేరుకు ఉన్న క్రేజే వేరు. ప్రస్తుతం జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్ 2026 పోటీల్లో అర్జెంటీనాను గెలిపించేందుకు ఆయన మైదానంలో చెమటోడుస్తుంటే, కొందరు బాధ్యతారహితంగా ప్రచారం చేసిన ఒక వార్త ఇప్పుడు అంతర్జాతీయంగా సంచలనం సృష్టించింది. మెస్సీ తండ్రి జార్జ్ మెస్సీ మరణించారంటూ అర్జెంటీనాకు చెందిన ఒక ప్రముఖ మీడియా ఛానల్ లైవ్ బ్రాడ్‌కాస్ట్‌లో తప్పుడు వార్తను ప్రసారం చేసింది. ఈ తప్పిదంపై మెస్సీ కుటుంబం ఆగ్రహం వ్యక్తం చేయడంతో, సదరు ఛానల్ మేనేజ్‌మెంట్ కీలక నిర్ణయం తీసుకుంది.
లైవ్ షోలో ఘోర తప్పిదం.. యాంకర్ అవుట్
అర్జెంటీనాలో 2020 నుంచి అత్యంత ప్రజాదరణ పొందిన ‘లూజు టీవీ’ (Luzu TV) న్యూస్ ఛానల్‌లో ఈ తప్పుడు వార్త ప్రసారమైంది. లైవ్ కార్యక్రమం నడుస్తుండగా, హోస్ట్ ఫ్లోరెన్సియా పెన్యా హఠాత్తుగా మెస్సీ తండ్రి కన్నుమూశారని ప్రకటించారు. అంతేకాకుండా, ఈ విషాదం కారణంగా ప్రస్తుతం జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్ మ్యాచ్‌లకు మెస్సీ దూరం కానున్నాడంటూ కథనాన్ని అల్లేశారు. ఈ వార్త క్షణాల్లో వైరల్ కావడంతో మెస్సీ అభిమానులు దిగ్భ్రాంతికి గురయ్యారు.
క్షమాపణలు చెప్పిన ఫ్లోరెన్సియా
ఈ ప్రచారంపై మెస్సీ కుటుంబం వెంటనే స్పందించి, అది పూర్తిగా అవాస్తవమని తేల్చిచెప్పింది. జార్జ్ మెస్సీ ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని, ఆయన ఆరోగ్యం మెరుగుపడుతోందని ఒక ప్రకటన విడుదల చేసింది. నిజం బయటకు రావడంతో టీవీ హోస్ట్ ఫ్లోరెన్సియా పెన్యా సోషల్ మీడియా వేదికగా మెస్సీ కుటుంబానికి బహిరంగ క్షమాపణలు చెప్పారు. ప్రొడక్షన్ టీమ్ తనకు తప్పుడు సమాచారం ఇచ్చిందని చెబుతూనే, లైవ్‌లో ఆ వార్త చదివినందుకు బాధ్యత వహిస్తూ ఛానల్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.
వేటు వేసిన ఛానల్ యాజమాన్యం
ఈ ఘటనను లూజు టీవీ యాజమాన్యం చాలా సీరియస్‌గా తీసుకుంది. సరైన ధృవీకరణ లేకుండా ఇలాంటి సమాచారాన్ని ప్రసారం చేయడం క్షమించరాని నేరమని పేర్కొంది. దీనికి బాధ్యులైన హోస్ట్ ఫ్లోరెన్సియా పెన్యాతో పాటు, తప్పుడు సమాచారాన్ని అందించిన ప్రొడక్షన్ క్రూ సిబ్బంది మొత్తాన్ని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. బాధ్యతాయుతమైన జర్నలిజానికి కట్టుబడి ఉంటామని స్పష్టం చేసింది. ఇటీవల అల్జీరియాతో జరిగిన మ్యాచ్‌లో మెస్సీ గోల్ కొట్టిన తర్వాత భావోద్వేగానికి గురికావడానికి కారణం ఫుట్‌బాల్ కాదు, ఈ కుటుంబ ఆరోగ్య సమస్యలేనని సమాచారం.


