బై బై మాల్దీవులు చలో లక్షద్విప్‌ | Sakshi
Sakshi News home page

బై బై మాల్దీవులు చలో లక్షద్విప్‌

Published Fri, Jan 12 2024 3:46 AM

maldives tour package prices drop massively amid diplomatic row with india - Sakshi

సాధారణంగా హైదరాబాద్‌ నుంచి ప్రతి రోజూ వందలాది మంది టూరిస్టులు మాల్దీవులకు వెళ్తారు. హైదరాబాద్‌ నుంచి కేవలం రెండున్నర గంటల ప్రయాణం కావడం, ఎక్కువ సంఖ్యలో దీవులు, ఆకట్టుకునే బీచ్‌లు, ఆహ్లాదకరమైన వాతావరణం ఉండటంతో మూడు, నాలుగు రోజుల పాటు గడిపేందుకు ఆసక్తి చూపుతారు. కానీ మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కొద్ది రోజులుగా ఈ టూర్లు పూర్తిగా తగ్గిపోయాయి.  

సాక్షి, హైదరాబాద్‌: పర్యాటకులకు స్వర్గధామంగా భావించే మాల్దీవుల పట్ల నగరవాసులు విముఖతను ప్రదర్శిస్తున్నారు. సాధారణంగా హైదరాబాద్‌ నుంచి మాల్దీవులకు రోజూ విమానాలు రాకపోకలు సాగిస్తాయి. పర్యాటకులతోపాటు కొత్తగా పెళ్లయిన జంటలు మాల్దీవులను హనీమూన్‌కు ఎంపిక చేసుకుంటారు. అలాగే డెస్టినేషన్‌ వెడ్డింగ్‌లకు కూడా మాల్దీవులు కొంతకాలంగా కేరాఫ్‌గా మారింది. కానీ ఇటీవల ప్రధాని మోదీ లక్షద్వీప్‌ పర్యటన సందర్భంగా మాల్దీవుల మంత్రులు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో దేశంతోపాటు నగరం నుంచీ అక్కడికి వెళ్లే పర్యాటకుల సంఖ్య అకస్మాత్తుగా పడిపోయింది.

ఇప్పటికే ప్యాకేజీలు బుక్‌ చేసుకున్న వాళ్లు పర్యటనలు వాయిదా వేసుకుంటుండగా, కొత్తగా ఎలాంటి బుకింగ్‌లు కావడం లేదని హైదరాబాద్‌కు చెందిన పలు ట్రావెల్స్‌ సంస్థలు తెలిపాయి. పలు ఎయిర్‌లైన్స్, ట్రావెల్స్‌ సంస్థలు విమాన, ప్యాకేజీ చార్జీలను తగ్గించినప్పటికీ మాల్దీవులకు వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదని నగరానికి చెందిన ఒక ప్రముఖ ట్రావెల్స్‌ సంస్థ ప్రతినిధి తెలిపారు. సంక్రాంతి సందర్భంగా వరుస సెలవులను దృష్టిలో ఉంచుకుని వెళ్లే వాళ్లు కూడా తమ పర్యటనలను వాయిదా వేసుకున్నట్లు చెప్పారు. దీంతో కొత్త సంవత్సరం సందర్భంగా ఉండే డిమాండ్‌ కూడా బాగా తగ్గిందన్నారు. 

లక్షద్విప్‌ వైపు సిటీ చూపు..
మాల్దీవులకు ప్రత్యామ్నాయంగా నగర పర్యాటకులు లక్షద్విప్‌ను ఎంపిక చేసుకుంటున్నారు. దీంతో లక్షద్వీప్‌కు పర్యాటక ప్యాకేజీలు, విమాన చార్జీలు కూడా పెరిగాయి. లక్షద్విప్‌లో రెండు రోజుల క్రూయిజ్‌ పర్యటనకు గతంలో రూ.20 వేలు ఉంటే ప్రస్తుతం రూ.35 వేల వరకు ప్యాకేజీ ధరలు పెరిగాయి. ప్యాకేజీల వివరాలను తెలుసుకొనేందుకు పదుల సంఖ్యలో ఫోన్‌కాల్స్‌ వస్తున్నట్లు సికింద్రాబాద్‌కు చెందిన ఒక పర్యాటక సంస్థ ప్రతినిధి చెప్పారు. లక్షద్విప్‌తోపాటు సమీప ప్రాంతాల్లో పర్యటించేందుకూ సిటీజనులు మొగ్గుచూపుతున్నారు. మరోవైపు గోవా, డామన్‌ డయ్యూ, కోవలం తదితర ప్రాంతాలకు సైతం సిటీ టూరిస్టులు తరలివెళ్తున్నారు.  

ప్యాకేజీల్లో భారీ రాయితీలు
ఒక్కసారిగా మాల్దీవులకు వెళ్లే టూరిస్టులు తగ్గిపోవడంతో ట్రావెల్స్‌ సంస్థలు, ఎయిర్‌లైన్స్‌ భారీ ఆఫర్లతో ముందుకొచ్చాయి. గతంలో మూడు రోజుల ప్యాకేజీ రూ.55,000 నుంచి రూ.72,000 వరకు ఉంటే దాన్ని ఇప్పుడు రూ.45,000 నుంచి రూ.60,000 వరకు తగ్గించినట్లు ఒక ట్రావెల్‌ ఏజెంట్‌ చెప్పారు. అలాగే రూ.లక్షల్లో ఉండే ప్రీమియం ప్యాకేజీలపైనా భారీ తగ్గింపును ప్రకటించారు.

ప్రీమియం ప్యాకేజీలపై రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు తగ్గించినట్లు మరో ట్రావెల్స్‌ ప్రతినిధి తెలిపారు. విమానంలో సింగిల్‌ జర్నీ గతంలో రూ.20 వేల వరకు ఉంటే ఇప్పుడు రూ.15వేల వరకు తగ్గించారు. మరోవైపు ఇప్పటికే బుకింగ్‌లు చేసుకున్నవారు మాత్రం తమ పర్యటనలను రద్దు చేసుకోకుండా వాయిదా వేసుకుంటున్నారు. బుకింగ్‌లను రద్దు చేసుకుంటే భారీగా నష్టపోయే అవకాశం ఉండటంతో వాయిదా వేసుకుంటున్నారు. కానీ కొత్తగా బుకింగ్‌లు మాత్రం కావడం లేదు. అన్ని ట్రావెల్స్‌ సంస్థల్లో మాల్దీవులకు బుకింగ్‌లు పూర్తిగా స్తంభించాయి.

Advertisement
Advertisement