
పారిస్: ఫ్యాషన్ పుట్టిల్లుగా పేరొందిన ఫ్రాన్స్‌లోని పారిస్‌లో కొత్త డిజైన్ విలాసవంత వస్తువొకటి మార్కెట్లోకి రంగ ప్రవేశం చేసింది. కొత్త ఫ్యాషన్‌కు అనుగుణంగా మెటీరియల్ కొని, కొలతలు ఇచ్చి, ధరించేలోపే ఆ ఫ్యాషన్ పాతబడిపోతుందని పారిస్ గురించి చెబుతుంటారు. అలాంటి నగరంలో సరికొత్త హ్యాండ్ బ్యాగ్ ఒకటి ఇప్పుడు సందడి చేస్తోంది.
భారత్‌లో ఇరుకు సందుల్లో సర్రున దూసుకుపోయే సామాన్యుడి రథంగా పేరొందిన ఆటోరిక్షా ఆకృతిలో కొత్త బ్యాగ్‌ను సిద్ధంచేశారు. ప్రఖ్యాత ఫ్రాన్స్ లగ్జరీ బ్రాండ్ లూయిస్ విటన్ సంస్థ నిపుణులు ఈ బ్యాగ్‌ను రూపొందించారు. మూడు చక్రాలతో, రెండు చేతి హ్యాండిళ్లతో ఎంతో అందంగా బ్యాగ్‌కు తుదిరూపునిచ్చారు. ఒంటె రంగులో అత్యంత నాణ్యమైన తోలుతో దీనిని తయారుచేశారు.
మెన్స్ స్ప్రింగ్/సమ్మర్ 2026 కలెక్షన్‌లో భాగంగా భారతీయత ఉట్టిపడేలా నవకల్పనకు ఇలా జీవంపోశారు. మెన్స్‌వేర్ విభాగ క్రియేటివ్ డైరెక్టర్ అయిన ఫారెల్ విలియమ్స్ సారథ్యంలోని బృందం ఈ ఆటోరిక్షా హ్యాండ్‌బ్యాగ్‌ను రూపొందించింది. దీని ధర కేవలం 35 లక్షల రూపాయలు అని ‘డైట్ పరాటా’ అనే నెటిజన్ ఒకరు వెల్లడించారు.
వైకుంఠపాళి డిజైన్ ర్యాంప్‌వాక్ స్టేజీపై ఒక వ్యక్తి నడుచుకుంటూ వచ్చి ఈ బ్యాగ్‌ను ప్రదర్శిస్తున్న వీడియో ప్రస్తుతం ఆన్‌లైన్‌లో తెగ వైరల్ అవుతోంది. దీనిపై కామెంట్ల పరంపర కొనసాగింది. ‘‘మధ్యతరగతి వాహనం ఇలా ఎట్టకేలకు పారిస్ ఫ్యాషన్ షోలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది’’, ‘‘ పశ్చిమ దేశాలకు ఒక్కసారిగా ఆసియా ఖండం, భారత్‌పై మక్కువ పెరిగినట్లుంది.
ప్రాడా వారి కొల్హాపురీ పాదరక్షలు, బాస్మతీ రైస్ బ్యాగులతో దుస్తులు.. ఇలా ఇంకెన్నో వస్తువులు ఇప్పుడు ఒక్కసారిగా అంతర్జాతీయ ఫ్యాషన్‌గా మారిపోయాయి’’ అని కామెంట్లు పెట్టారు. ‘‘ఫ్యాషన్ డిజైనర్ల మెదళ్లలో ఐడియాలు ఇంకిపోయాయి. అందుకే ఇలా భారత్‌పై పడ్డారు’’, ‘‘ ఆటో బాగుందిగానీ ఎక్కడి నుంచి లోపలికి ఎక్కాలి?’’, ‘‘ ఆ బ్యాగ్ కొనాలంటే ఎన్ని ఆటోలను అమ్మాలో?’’ అని మరికొందరు పోస్ట్‌లు పెట్టారు. ‘‘ గతంలో ఇదే లూయిస్ విటన్ విమానాలు, డాలి్ఫన్లు, పీతల ఆకృతుల్లో బ్యాగులు తెచ్చింది’’ అని మరొకరు గుర్తుచేశారు.