LA Protests: వెనక్కి తగ్గిన ట్రంప్‌? | LA Protests: Trump pauses immigration raids Check Complete Details | Sakshi
Sakshi News home page

అక్రమ వలసదారులు.. వెనక్కి తగ్గిన ట్రంప్‌?

Jun 14 2025 12:15 PM | Updated on Jun 14 2025 1:04 PM

LA Protests: Trump pauses immigration raids Check Complete Details

అమెరికావ్యాప్తంగా అక్రమ వలసదారుల కోసం కొనసాగుతున్న తనిఖీలు.. అరెస్టులు ఒక్కసారిగా నిలిచిపోయాయి. ఈ విషయంలో కోర్టు పరోక్షంగా ప్రభుత్వ చర్యలకు మద్దతు ప్రకటించింది. అయినప్పటికీ లాస్‌ ఏంజెల్స్‌ నిరసనలతోనే(LA Protests) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వెనక్కి తగ్గినట్లు సమాచారం.

అక్రమ వలసదారుల్ని గుర్తించి వెనక్కి పంపించేందుకు ట్రంప్‌ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఈ క్రమంలో బలవంతపు తనిఖీలు, అరెస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఈ పరిణామంతో లాస్‌ ఏంజెల్స్‌లో ఉవ్వెత్తున నిరసన జ్వాలలు ఎగసిపడ్డాయి. క్రమంగా అవి మిగతా ప్రాంతాలకు విస్తరించాయి.  అయితే తాజాగా.. హోటళ్లు, రెస్టారెంట్‌లు, వ్యవసాయ సంబంధిత పరిశ్రమల్లో సోదాలను ఆపేయాలంటూ ఇమ్మిగ్రేషన్‌ & కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌(ICE)కి ఆదేశాలు వెళ్లాయి.

ఈ విషయాన్ని న్యూయార్క్‌ టైమ్స్‌ ప్రముఖంగా ప్రచురించగా.. ముగ్గురు ఉన్నత అధికారులు సైతం ధృవీకరించారు. అంతకు ముందు.. ట్రంప్‌ గురువారం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ‘‘వలసదారులు ఎక్కువగా పనిచేస్తున్న ఈ ప్రాంతంలో వ్యాపార కార్యకలాపాలకు ఆటంకం కలగకుండా త్వరలోనే ఓ ఉత్తర్వును జారీ చేస్తాను’’ అన్నారు. ఈ నేపథ్యంలో లాస్ఏంజెలెస్‌ ప్రాంతంలోని వ్యవసాయ పరిశ్రమలు, హోటళ్లు, రెస్టరంట్‌లలో సోదాలు నిలిపివేయాలని ఆయన ఆదేశించినట్లు తెలుస్తోంది.

అక్రమ వలసదారులను అరెస్టు చేసేందుకు ఐసీఈ అధికారులు గత శుక్రవారం లాస్‌ఏంజెల్స్‌లోని డౌన్‌టౌన్‌లో సోదాలు ప్రారంభించడంతో ఈ నిరసనలు ప్రారంభమయ్యాయి. క్రమంగా దేశమంతటా విస్తరిస్తుండడంతో .. లాస్‌ఏంజెల్స్‌లో భారీస్థాయిలో నేషనల్‌ గార్డ్‌లను మోహరింపునకు ట్రంప్‌ ఆదేశించారు. దీంతో ఉద్రిక్తతలు మరింత తీవ్రతరమయ్యాయి. ఈ నేపథ్యంలో నిరసనకారులను అడ్డుకునేందుకు మరో 2వేల మంది నేషనల్‌ గార్డులను మోహరించాలని ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. 

ట్రంప్‌ చర్యలను కాలిఫోర్నియా గవర్నర్‌ గవిన్‌ న్యూసమ్, లాస్‌ ఏంజెలెస్‌ మేయర్‌ కరెన్‌ బాస్‌తోపాటు స్థానిక పోలీసు అధికారులు వ్యతిరేకించారు. గవిన్‌ దీనిపై ఫెడరల్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేయగా.. అధ్యక్షుడి ఆదేశాలు చెల్లవని న్యాయస్థానం తేల్చిచెప్పింది. అయితే.. ఫెడరల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వును తొమ్మిదో యూఎస్‌ సర్క్యూట్‌ కోర్టు ఆఫ్‌ అప్పీల్స్‌ తాత్కాలికంగా నిలిపివేసింది. ట్రంప్‌ నిర్ణయానికి పరోక్షంగా మద్దతు పలికింది. కోర్టు నిర్ణయంతో నేషనల్‌ గార్డు సిబ్బందికి అడ్డంకి తొలగిపోగా.. నిరసనకారులను ఎక్కడికక్కడ అరెస్టు చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఆపై ఈ నిర్ణయానికి తాత్కాలిక బ్రేక్‌ వేస్తూ మళ్లీ ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement