50కి పెరిగే అవకాశం
కరాచీ: పాకిస్తాన్‌లోకి కరాచీలో జనసమ్మర్థ గుల్ ప్లాజా షాపింగ్ మాల్‌లో శనివారం రాత్రి జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య సోమవారానికి 26కు పెరిగింది. దాదాపు 60 మంది మంది జాడ గల్లంతైంది. మంటలను ఆదివారం రాత్రి అదుపులోకి తెచ్చారు. దీంతో భారీ హోల్‌సేల్, రిటైల్ దుకాణాల సముదాయమైన ఈ షాపింగ్ మాల్‌లోకి సోమవారం ఉదయం అగి్నమాపక సిబ్బంది ప్రవేశించి శిథిలాలను తొలగిస్తున్నారు.
మరికొందరి మృతదేహాలు లభ్యమవడంతో మరణాల సంఖ్య పెరిగింది. ఇంకా పలువురు ఆచూకీ తెలియాల్సి ఉందని ‘రెస్క్యూ 1122’అధికార ప్రతినిధి హసన్ ఉల్ హసీబ్‌ఖాన్ చెప్పారు. అయితే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో మరణాల సంఖ్య 50 దాటవచ్చని కరాచీ కమిషనర్ హసన్ నఖ్వీ అభిప్రాయపడ్డారు. ఘటనపై సింధ్ ముఖ్యమంత్రి మురాద్ అలీ షా దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.
మృతుల కుటుంబాలకు తలో కోటి పాకిస్తాన్ రూపాయలను ఆయన ఎక్స్‌గ్రేషియాగా ప్రకటించారు. ప్రమాదంలో షాపింగ్‌మాల్‌లోని దాదాపు 300 కోట్ల పాక్ రూపాయల సరకు బుగ్గిపాలైందని అంచనావేస్తున్నారు. భవనం చాలా గంటలపాటు కాలిపోవడంతో నిర్మాణం బాగా దెబ్బతిన్నదని, దాదాపు భవనం మొత్తాన్ని నేలమట్టం చేయాల్సి రావొచ్చని అధికారులు అంచనావేస్తున్నారు. కరాచీలో సరైన రక్షణ, భద్రతా ఏర్పాట్లు లేకపోవడం, అధిక విద్యుత్ లోడు, అక్రమ నిర్మాణాల కారణంగా గతంలో పలు షాపింగ్ మాల్స్ ప్రమాదాల బారిన పడ్డాయి.


