
ట్రంప్ యంత్రాంగానికి ఫెడరల్ జడ్జి ఆదేశాలు
లాస్ ఏంజెలెస్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వలసదారులను ఎక్కడపడితే అక్కడ ఆపి తనిఖీలు చేపట్టడం, అరెస్ట్‌లు చేయడం తక్షణమే ఆపేయాలని ఫెడరల్ జడ్జి ఒకరు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుత ప్రభుత్వం దక్షిణ కాలిఫోర్నియా ప్రాంతంలోని హిస్పానిక్‌లు, లాటినోలను పథకం ప్రకారం వేధిస్తోందని గత వారం లాస్ ఏంజెలెస్‌లోని యూఎస్ డి్రస్టిక్ట్ కోర్టులో వలసదారుల తరఫున పలు పిటిషన్లు దాఖలయ్యాయి.
గుర్తింపు కార్డులు చూపినా ఇద్దరు అమెరికా పౌరులను మరో ముగ్గురు వలసదారులను ఎటువంటి వారెంట్లు లేకుండా అధికారులు నిర్బంధంలోకి తీసుకున్నారని ఆరోపించారు. కేవలం శరీరం రంగు ఆధారంగా అరెస్ట్‌లు చేయడం రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు. విచారణ చేపట్టిన జడ్జి మామె ఈ ఫ్రిమ్‌పాంగ్ శుక్రవారం పలు ఆదేశాలను వెలువరించారు. లాస్ ఏంజెలెస్ సహా కాలిఫోర్నియాలోని ఏడు కౌంటీల పరిధిలో వలసదారుల అరెస్ట్‌లు, సోదాలను నిలిపివేయాలన్నారు. అంతేకాదు, వలసదారులను నిర్బంధించిన లాస్ ఏంజెలెస్ డిటెన్షన్ కేంద్రంలోకి అటార్నీ ప్రవేశించకుండా ఫెడరల్ ప్రభుత్వం ఇచి్చన ఉత్తర్వులను సైతం రద్దు చేశారు.