విబేధాల పరిష్కారం దిశగా తొలి అడుగు

Joe Biden, Vladimir Putin meet in Geneva - Sakshi

జెనీవాలో సమావేశమైన బైడెన్, పుతిన్‌

నిర్మాణాత్మకంగా చర్చలు జరిగాయన్న రష్యా అధ్యక్షుడు

రెండు గొప్ప శక్తుల భేటీ అన్న బైడెన్‌

జెనీవా: అగ్రదేశాలు అమెరికా, రష్యాల అధ్యక్షులు జో బైడెన్, వ్లాదిమిర్‌ పుతిన్‌ల శిఖరాగ్ర సమావేశం బుధవారం జెనీవా వేదికగా జరిగింది. సుహృద్భావ వాతావరణంలో భేటీ జరిగిందని, తమ ఇద్దరి మధ్య ఎలాంటి విరోధ భావన నెలకొనలేదని పుతిన్‌ పేర్కొన్నారు. చర్చలు నిర్మాణాత్మకంగా జరిగాయన్నారు. ‘చాలా అంశాల్లో మేం విబేధిస్తాం. అయితే, ఒకరినొకరు అర్థం చేసుకునే, పరస్పరం దగ్గరయ్యే దిశగా ముందడుగు వేశామని భావిస్తున్నా’ అని పుతిన్‌ పేర్కొన్నారు. ఇరుదేశాల రాయబారులను తమతమ విధుల్లో చేరేందుకు తాను, బైడెన్‌ అంగీకరించామన్నారు.

రెండు దేశాల మద్య విబేధాలను తొలగించేందుకు, అణ్వాయుధ పరిమితిపై ఒప్పందానికి సంబంధించి చర్చలను ప్రారంభించేందుకు అంగీకారం కుదిరిందన్నారు. సైబర్‌ సెక్యూరిటీపైనా చర్చలు జరపాలని నిర్ణయించారు.  ‘చర్చల సమయంలో మా మధ్య ఎలాంటి శత్రు భావం లేదు. అనుకున్న సమయం కన్నా ముందే చర్చలను ముగించాం’ అన్నారు.  రెండు గొప్ప శక్తుల మధ్య భేటీగా ఈ సదస్సును చర్చలకు ముందు బైడెన్‌ అభివర్ణించారు. ముఖాముఖి చర్చలెప్పుడూ మంచిదేనని వ్యాఖ్యానించారు.  ఇద్దరు నేతలు అంత సౌకర్యవంతంగా కనిపించలేదు.

గత కొన్ని నెలలుగా ఇరువురు నేతల మధ్య తీవ్రస్థాయిలో విమర్శలు, ప్రతివిమర్శలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. చర్చలు ముగిసిన అనంతరం ఇరువురు నేతలు వేర్వేరుగా మీడియా సమావేశంలో పాల్గొనడం విశేషం. మొదట పుతిన్, ఆ తరువాత బైడెన్‌ చర్చల వివరాలను వేర్వేరుగా మీడియాకు తెలిపారు. సైబర్‌ భద్రత అంశంపై చర్చలు జరపాలని రెండు దేశాలు సూత్రప్రాయంగా అంగీకరించాయని పుతిన్‌ వెల్లడించారు. అమెరికాలోని వ్యాపార, ప్రభుత్వ సంస్థల వెబ్‌సైట్స్‌ను రష్యా హ్యాక్‌ చేస్తోందని యూఎస్‌ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఆరోపణలను పుతిన్‌ ఖండించారు. చర్చల సందర్భంగా మానవ హక్కుల అంశాన్ని, ప్రతిపక్ష నేత నేవల్నీ జైలు శిక్ష విషయాన్ని బైడెన్‌ ప్రస్తావించారని పుతిన్‌ వెల్లడించారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top