
టోక్యో: వరుస భూకంపాలు జపాన్‌లోని మారుమూల ద్వీపాలను నిద్రలేకుండా చేస్తున్నాయి. కేవలం రెండు వారాల్లో 900 భూకంపాలు సంభవించాయి. దీంతో ప్రజలకు రాత్రుళ్లు నిద్ర ఉండటం లేదు. ఏ క్షణం ఏం జరగుతుందోని ఆందోళనతో రాత్రంతా మేల్కొని ఉంటున్నారు. జూన్ 21 నుంచి టోకారా దీవుల చుట్టూ ఉన్న సముద్రాలలో భూకంప కార్యకలాపాలు చాలా చురుగ్గా ఉన్నాయని, బుధవారం 5.5 తీవ్రతతో భూకంపం సంభవించిందని అధికారులు తెలిపారు.
అయితే ఎలాంటి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. కానీ అవసరమైతే ఖాళీ చేయడానికి సిద్ధంగా ఉండాలని ప్రజలకు సూచించారు. భూమిపై అత్యంత భూకంప ప్రమాదం ఉన్న దేశాలలో జపాన్ ఒకటి. టెక్టోనిక్ ప్లేట్లు కలిసే.. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రదేశంలో ఉండటంతో తరచూ భూకంపాలు వస్తుంటాయి. ఇది ప్రతి సంవత్సరం దాదాపు 1,500 భూకంపాలను ఎదుర్కొంటుంది. కాగా, 12 టోకారా దీవులలో ఏడింటిలో దాదాపు 700 మంది నివసిస్తున్నారు. ఈ సుదూర దీవులలో కొన్నింటిలో ఆసుపత్రులు లేవు. ప్రిఫెక్చురల్ రాజధాని కగోషోమాకు వెళ్లాలంటే ఫెర్రీలో కనీసం ఆరు గంటలు ప్రయాణించాలి. భూకంపాల కారణంగా టోకారా దీవుల్లోని కొన్ని గెస్ట్‌హౌస్‌లు పర్యాటకులను అనుమతించడం లేదు. త్వరలో భారీ, ప్రాణాంతక భూకంపం సంభవించవచ్చనే వదంతులలో దేశం మొత్తం ఆందోళన చెందుతున్న తరుణంలో ఈ వరుస ప్రకంపనలు వస్తున్నాయి.
🌏 Current Earthquake Swarm ongoing south of Southern mainland #Japan near Tatsugō.
Several M 4.5+ events - could portend a stronger #earthquake to come, and the region should be monitored closely 👀
⚠️ This is one of the riskiest world areas in JULY 2025 because of this. pic.twitter.com/K0dmPQZMrP— Weather & Earth 25 (@Weather_Earth25) July 2, 2025
ఇదిలా ఉండగా.. శనివారం (జూలై 5న) మెగా సునామీ విరుచుకుపడబోతోందా? జపాన్, ఫిలిప్పీన్స్ మధ్య ప్రాంతాన్ని ముంచెత్తనుందా? ‘జపాన్ బాబా వాంగా’ పేరుతో ప్రసిద్ధురాలైన ర్యో తత్సుకీ జోస్యం నిజమైతే అక్షరాలా అదే జరగనుంది! ‘ద ఫ్యూచర్ ఐ సా (నేను దర్శించిన భవిష్యత్తు)’ పేరుతో రాసిన పుస్తకంలో ఆమె ఈ మేరకు ఎప్పుడో హెచ్చరించారు. దీంతో, శనివారం నిజంగానే సునామీ వస్తుందా అంటూ ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఊపిరి బిగబట్టి మరీ ఎదురు చూస్తున్నారు. ఈ జోస్యానికి సంబంధించిన వార్తలు, చర్చోపచర్చలతో రెండు రోజులుగా ఇంటర్నెట్ అక్షరాలా హోరెత్తిపోతోంది. ‘జూలై5డిజాస్టర్’ ఇప్పుడు ఆన్‌లైన్‌లో ట్రండింగ్‌లో ఉంది. ఈ భయాందోళనల నడుమ టోక్యో, సమీప ప్రాంతాల్లో విమాన తదితర ప్రయాణాలను జనం భారీగా రద్దు చేసుకుంటున్నారు.
తత్సుకీ ఏం చెప్పారు?
కరోనా ఉత్పాతాన్ని కూడా తుత్సుకీ ముందే ఊహించి చెప్పడం విశేషం! అప్పటినుంచీ ఆమె పేరు ప్రపంచమంతటా మార్మోగడం మొదలైంది. ఇక జూలై 5న వస్తుందని పేర్కొన్న సునామీ గురించి తన పుస్తకంలో 20 ఏళ్ల ముందే పేర్కొన్నారామె. ‘జపాన్, ఫిలిప్పీన్స్ నడుమ సముద్రగర్భం ఒక్కసారిగా బద్దలవుతుంది. ఆకాశహరమ్యలను తలదన్నేంత ఎత్తున అలలు ఎగిసిపడతాయి. లక్షలాది మందికి ప్రాణగండం’ అంటూ వర్ణించారు. దాంతో ఇది కూడా నిజమవుతుందా అంటూ ఎక్కడ చూసినా అంతులేని ఉత్కంఠ రాజ్యమేలుతోంది.

ఎవరీ తత్సుకీ?
తత్సుకీ జపాన్‌కు చెందిన మాంగా ఆర్టిస్టు. ‘ద ఫ్యూచర్ ఐ సా (నేను దర్శించిన భవిష్యత్తు)’ ఆమె స్వయంగా చేత్తో రాసిన పుస్తకం. బ్రిటన్ యువరాణి డయానా మృతి, 2011లో జపాన్‌ను వణికించిన భూకంపం, సునామీ తదితరాలను అందులో ఆమె ముందుగానే పేర్కొన్నారు. అవన్నీ అక్షరాలా నిజమయ్యాయి కూడా. దాంతో గత శతాబ్దికి చెందిన బల్గేరియా మిస్టిక్, హీలర్ బాబా వంగా పేరిట ఆమెను ఇప్పుడంతా ‘జపనీస్ బాబా వంగా’ అంటూ కీర్తిస్తున్నారు.