
యుద్ధం వెంటనే ఆపండి రోడ్డెక్కిన వేలాది మంది
ఇజ్రాయెలీలు రహదారుల దిగ్బంధం, 38 మంది అరెస్టు
జెరూసలేం: ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ గాజాపై సైనిక చర్యకు ప్రణాళికలు వేస్తుండగా.. ఇజ్రాయేలీలు నిరసన బాట పట్టారు. గాజాపై యుద్ధం ముగించాలని, బం«దీలను విడుదల చేయడానికి హమాస్‌తో ఒప్పందం కుదుర్చుకోవాలని డిమాండ్ చేస్తూ రోడ్డెక్కారు. ర్యాలీలను నిర్వహించారు. జెరూసలేం, టెల్ అవీవ్‌లను కలిపే ప్రధాన రహదారిని ప్రదర్శనకారులు దిగ్బంధించారు.
ఆదివారం దేశవ్యాప్తంగా జరిగిన ఆందోళనల్లో వేలాది మంది ఇజ్రాయెలీలు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ర్యాలీల్లో ఇజ్రాయెల్ జెండాలను ఊపుతూ, బందీల ఫొటోలను ప్రదర్శిస్తూ పాల్గొన్నారు. కొమ్ము బూరలు ఊది, డ్రమ్స్ మోగించి నిరసన తెలిపారు. ప్రధాన రహదారులను దిగ్బంధించారు. దీంతో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. పోలీసులు 38 మంది నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. ఇజ్రాయెల్ నటి గాల్ గాడోట్ కూడా ప్రదర్శనల్లో పాల్గొన్నారు. బందీల కుటుంబాలను కలిసి సంఘీభావం తెలిపారు.
ఈ ర్యాలీకి ప్రతిపక్ష నాయకుడు యైర్ లాపిడ్ హాజరై ప్రదర్శనకారులకు తన సంఘీభావాన్ని తెలిపారు. ‘దేశాన్ని బలోపేతం చేసే ఏకైక విషయం. అద్భుతమైన స్ఫూర్తితో ప్రజలు బయటకు అడుగు పెట్టారు’అని ఆయన ఎక్స్‌లో పోస్ట్‌చేశారు. బందీల కుటుంబాలు నిర్వహించిన ఈ సమ్మెకు వ్యాపార సంస్థలు సైతం మద్దతు ఇచ్చాయి. సిబ్బందిని నిరసనల్లో పాల్గొనేందుకు స్వచ్ఛందంగా మూసేశారు. వేసవి సెలవుల కారణంగా పాఠశాలలపై ఎలాంటి ప్రభావం పడలేదు. యెమెన్ క్షిపణి ప్రయోగిస్తుందని వైమానిక దాడి సైరన్లు హెచ్చరించడంతో స్థానిక సమయం ప్రకారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ప్రదర్శనలు తాత్కాలికంగా నిలిపివేశారు.
అయితే.. హమాస్ లొంగిపోకుండా యుద్ధాన్ని ముగించాలనే పిలుపు ఆ గ్రూపును బలోపేతం చేస్తుందని ప్రధాని నెతన్యాహు అన్నారు. ఇది బందీల విడుదల మరింత ఆలస్యం చేస్తుందని హెచ్చరించారు. మంత్రివర్గ సమావేశంలో మాట్లాడిన ఆయన గాజా నగరాన్ని సైన్యం స్వా«దీనం చేసుకునే ప్రణాళికలను పునరుద్ఘాటించారు. ఈ చర్యను ఇజ్రాయెలీలు, ముఖ్యంగా బందీల కుటుంబాలు వ్యతిరేకిస్తున్నాయి. ఇది బతికి ఉన్న బందీల ప్రాణాలకు ముప్పని భయపడుతున్నారు.