
లుక్సార్: ఈజిప్టులోని లుక్సార్ నగరంలో ఫారో చక్రవర్తి సమాధిని రెండు దశాబ్దాల అనంతరం సందర్శకుల కోసం శనివారం తిరిగి తెరిచారు. ఈజిప్టును క్రీస్తు పూర్వం 1390–1350 మధ్యన పాలించిన అమెన్‌హోటెప్–3 సమాధి ‘ప్రఖ్యాత వాలీ ఆఫ్ కింగ్స్’లో పశ్చిమ దిక్కున ఉంది. దీనిని 1799లో గుర్తించారు. ఇందులోని ప్రధానమైన సార్కోఫాగస్(మమ్మీ) సహా ముఖ్యమైన వస్తువులు లూటీకి గురయ్యాయని ఈజిప్షియన్ యాంటిక్విటీస్ అథారిటీ తెలిపింది. జపాన్ ఆర్థిక, సాంకేతిక సాయంతో రెండు దశాబ్దాలపాటు మూడు దఫాలుగా ఈ సమాధి పునరుద్ధరణ పనులు సాగాయి.
ఫారో, ఆయన భార్య సమాధి గోడలపై ఉన్న చిత్రాలకు రంగులు అద్దడం కూడా ఇందులో ఉన్నాయి. సార్కోఫాగస్‌ను ఉంచిన భారీ పెట్టె ఫ్రేమ్ కూడా ఇందులో ఉంది. వ్యాలీ ఆఫ్ కింగ్స్ ప్రాంతంలో 36 మీటర్ల పొడవు, 14 మీటర్ల లోతున మెట్ల దారి సమాధికి దారి తీస్తుంది. ఇందులో చక్రవర్తిని ఉంచిన ప్రధాన సమాధి ఛాంబర్‌తోపాటు ఆయన ఇద్దరు భార్యలకు రెండు ఛాంబర్లున్నాయి. వ్యాలీ ఆఫ్ కింగ్స్‌లో ప్రాచీన ఈజిప్టును క్రీస్తుపూర్వం 1550–1292 సంవత్సరాల మధ్య పాలించిన 17 మంది రాజులు, రాణుల మమ్మీలతోపాటు మరో 16 ఇతరుల మమ్మీలున్నాయి.