ఘన చరితను కళ్లకు కట్టినట్లు చూపుతున్న గ్రాండ్ ఈజిప్షియన్ మ్యూజియం
శనివారం నుంచి సందర్శకులకు అందుబాటులోకి
2.58లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో లక్షకుపైగా వస్తువుల ప్రదర్శన
కైరో: పిరమిడ్లు మొదలు మమ్మీలు, ఫారో చక్రవర్తుల దాకా ఎన్నో ప్రత్యేకతలున్న ఈజిప్ట్ మరోసారి అంతర్జాతీయ పురావస్తు ప్రపంచంలో తనదైన ముద్ర వేసేందుకు బయల్దేరింది. ప్రపంచంలోనే అతిపెద్దదైన ‘ గ్రాండ్ ఈజిప్షియన్ మ్యూజియం’ను దేశాధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ అల్–సిసీ ప్రారంభించారు. ప్రారంభోత్సవంలో పలు దేశాల అగ్రనేతలు, రాజకుటుంబీకులు పాల్గొన్నారు.
వేల సంవత్సరాల ఈజిప్ట్ ఘన చరిత్రను అందరికీ తెలియజేసేలా ఆనాటి రాజరిక సంబంధ అన్ని రకాల పురాతన వస్తువులను ఈ మ్యూజియంలో ప్రదర్శించనున్నారు. ఈజిప్ట్‌ను పరిపాలించిన 30 రాజవంశాలకు సంబంధించిన ప్రాచీన వస్తుసంపదను సందర్శకులు ఈ మ్యూజియంలో చూడొచ్చు. దేశ పర్యాటక రంగానికి పునర్‌వైభవ తేవడంతోపాటు ఆర్థికాభివృద్ధికి ఊతమిస్తుందనే ఉద్దేశంతో ఈ మ్యూజియంను నిర్మించారు.
ఈ మ్యూజియం నిర్మాణం 2005లో మొదలైంది. అయితే దేశంలో నెలకొన్న రాజకీయ అస్థిరత ఈ మ్యూజియం నిర్మాణం ముందుకు సాగనివ్వలేదు. పాక్షికంగా పనులు జరగడం, తర్వాత ఆగడం పరిపాటిగా మారింది. ఎట్టకేలకు ఇటీవలే మ్యూజియం నిర్మాణం పూర్తయింది. కైరో నగర శివారులో లక్షలాది మంది సందర్శకులకు అనువుగా సకల సదుపాయాలతో దీనిని కట్టారు.
నవంబర్ 4వ తేదీ నుంచి సాధారణ పర్యాటకులను లోపలికి అనుమతిస్తారు. ఈజిప్ట్ నాగరికత విశిష్టతన కళ్లకు కట్టేలా 1,00,000కుపైగా పురాతన వస్తువులను ప్రదర్శిస్తున్నారు. కేవలం ఒక్క దేశ నాగరికతను చూపే ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజియంగా ఇది రికార్డ్‌లకెక్కనుంది. ది గ్రేట్ గిజా పిరమిడ్‌కు అత్యంత సమీపంలో దీనిని కట్టారు. గాజు పలకలతో పిరమిడ్ ఆకృతిలో నిర్మించారు.
వేల కోట్ల రూపాయల వ్యయంతో..
పిరమిడ్ ఆకృతిలో 2,58,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో దాదాపు రూ.8,878 కోట్ల వ్యయంతో ఈ మ్యూజియం కట్టారు. మలేరియా, ఎముక వ్యాధితో వేల ఏళ్ల క్రితం కన్నుమూసిన, శాపాలకు ప్రసిద్ధిచెందిన ఈజిప్ట్ యువరాజు కింగ్ టుటెంక్‌మెన్ మమ్మీ సహా ఎన్నో వస్తువులు ఈ మ్యూజియంలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.


