కైరో: ప్రపంచ ప్రసిద్ది చెందిన పురాతన అద్భుతాలకు నిలయమైన ఈజిప్ట్ ఇప్పుడు మరో విశేష కట్టడాన్ని ఆవిష్కరిస్తోంది. గిజా పీఠభూమి పక్కన నిర్మితమైన గ్రాండ్ ఈజిప్షియన్ మ్యూజియం (జెమ్) దీర్ఘకాల నిరీక్షణ తర్వాత నవంబర్ 4న ప్రజల సందర్శనార్థం స్వాగత ద్వారాలు తెరుస్తోంది. రూపకల్పనలో ఈ మ్యూజియం పిరమిడ్‌ల ప్రతిరూపంలా ఉండటంతో దీనిని స్థానికులు ‘నాలుగో పిరమిడ్’గా అభివర్ణిస్తూ, ఇది అందనంత ఎత్తున ఉండటంతో అంతెత్తున లేచిన నాలుగో పిరమిడ్ అని అంటున్నారు.
రెండు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణం
2002లో అప్పటి అధ్యక్షుడు హోస్నీ ముబారక్ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు రాజకీయ మార్పులు, 2011 తిరుగుబాటు, కోవిడ్ మహమ్మారి తదితర సవాళ్ల కారణంగా పలుమార్లు నిలిచిపోయింది. దాదాపు 20 ఏళ్ల తర్వాత, $1 బిలియన్ వ్యయం(₹8,400 కోట్లు) తో పూర్తి స్థాయిలో రూపుదిద్దుకుంది. మ్యూజియం విస్తీర్ణం 24,000 చదరపు మీటర్లు. ఇందులో 2,58,000 చదరపు అడుగుల శాశ్వత ప్రదర్శన స్థలం ఉంది. ప్రతీ ఏటా కనీసం ఐదు మిలియన్ల మంది సందర్శకులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.

పురాతన చరిత్రకు ఆధునిక మెరుగులు
గిజా పీఠభూమిలోని ఖుఫు, ఖఫ్రే, మెన్‌కౌరే పిరమిడ్‌ల సమీపంలో నిలిచిన ఈ మ్యూజియం రూపకల్పనను ఐరిష్ సంస్థ హెనెగాన్ పెంగ్ ఆర్కిటెక్ట్స్ తీర్చిదిద్దింది. భవనాన్ని త్రిభుజాకార గాజుతో రూపొందించడంతో పక్కనే ఉన్న పిరమిడ్‌లకు ఒక చారిత్రక సౌందర్యం జత అయినట్లు కనిపిస్తోంది. భవనం మధ్యలో ఆరు అంతస్తుల భారీ మెట్లు, వాటి ఇరువైపులా ఫారోల విగ్రహాలు, దేవాలయాల అవశేషాలు, పురాతన సమాధులు ఏర్పాటు చేశారు. పై అంతస్తు నుండి మూడు పిరమిడ్‌ల దృశ్యం ప్రత్యక్షంగా కనిపించేలా దీనిని తీర్చిదిద్దారు.
లక్ష కళాఖండాల మహాసేకరణ
జీఈఎం(జెమ్)లో మొత్తం లక్షకు పైగా పురాతన కళాఖండాలు ఉన్నాయి. వీటిలో సుమారు సగభాగం ప్రదర్శనలో ఉండగా, మిగిలినవి ఉష్ణోగ్రత నియంత్రిత నిల్వ స్థావరాల్లో భద్రపరిచారు. ఈ కళాఖండాలు ఈజిప్టు ఫారోల 30 వంశాల కాలాన్ని, అంటే దాదాపు 5,000 ఏళ్ల నాగరికతను ప్రతిబింబిస్తాయి.
రామ్సెస్ II విగ్రహం ప్రధాన ఆకర్షణ
మ్యూజియం ప్రధాన ద్వారం వద్ద 11 మీటర్ల ఎత్తయిన రామ్సెస్ ది గ్రేట్ విగ్రహం సందర్శకులను స్వాగతిస్తుంది. 19వ వంశానికి చెందిన ఈ రాజు క్రీ.పూ. 1279–1213 కాలంలో పాలించాడు. 1820లో మెంఫిస్ ప్రాంతంలో కనుగొన్న ఈ విగ్రహం అనేక ప్రదేశాకు తరలించాక, చివరకు జెమ్‌లో స్థిర నివాసం పొందింది.

టుటన్‌ఖామున్ బంగారు సంపద
మ్యూజియంలోని 1922లో పురావస్తు శాస్త్రవేత్త హోవార్డ్ కార్టర్ కనుగొన్న టుటన్‌ఖామున్ సమాధి నుండి వెలికితీసిన 5,000 విలువైన వస్తువులను తొలిసారిగా ఒకే ప్రదేశంలో ప్రదర్శిస్తున్నారు. ఇందులో బంగారుతో చేసిన సార్కోఫాగస్, ప్రసిద్ధ స్వర్ణ ముఖావరణం, ఆభరణాలు, పూజా వస్తువులు ఉన్నాయి. శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం టుటన్‌ఖామున్ 19 ఏళ్ల వయసులో మలేరియా, ఎముక సంబంధిత వ్యాధితో మరణించాడు.
శాస్త్రవేత్తలకు స్వర్గధామం
ఈ మ్యూజియంలో అత్యాధునిక ప్రయోగశాలలు, పరిశోధనా కేంద్రాలు కూడా ఉన్నాయి. వాటిలో పురావస్తు శాస్త్రవేత్తలు శాస్త్రీయ పద్ధతుల్లో అధ్యయనం చేస్తున్నారు. ఈ ల్యాబ్‌లను సందర్శకులు కూడా చూడవచ్చు. ఇది ప్రపంచ మ్యూజియం రంగంలో అరుదైన ఆవిష్కరణగా భావిస్తున్నారు. ఆర్థిక సంక్షోభం, ద్రవ్యోల్బణం వంటి సమస్యలతో సతమతమవుతున్న ఈజిప్టు ప్రభుత్వం ఈ మ్యూజియాన్ని సాంస్కృతిక పునరుద్ధరణ కేంద్రంగా భావిస్తోంది. పర్యాటక ఆదాయం పెరగడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు ఊపిరి అందుతుందని అనుకుంటోంది. ఈ గ్రాండ్ మ్యూజియం 2025, నవంబర్ 4న సందర్శకులకు తలుపులు తెరుస్తోంది. నాలుగో పిరమిడ్‌గా నిలిచిన ఈ గ్రాండ్ ఈజిప్షియన్ మ్యూజియం మరో చరిత్రను సృష్టించబోతోందనడంలో సందేహం లేదు.


