ఇస్లామాబాద్: గత వారం రోజులుగా పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో చెలరేగుతున్న నిరసనోద్యమాన్ని చల్లార్చేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం ఎట్టకేలకు దిగివచ్చింది. మొదటి మిలిటరీని పంపి ఉద్యమాన్ని అణచివేయాలని ప్రయత్నించి విఫలమైన షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం.. చివరకు ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న జమ్ముకశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (జేకేజేఏఏసీ)తో ఒప్పందం చేసుకుంది.
ఈ క్రమంలో 25 అంశాలతో కూడిన ఒప్పందం ప్రతిని పాక్ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి తారిఖ్ ఫజల్ చౌదరి శనివారం సోషల్ మీడియాలో షేర్ చేశారు. గత నెల 29 నుంచి జరుగుతున్న హింసాత్మక ఘర్షణల్లో పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో 10 మంది మరణించారు. అనేకమంది గాయపడ్డారు. దీంతో పరిస్థితిని చక్కదిద్దేందుకు ముజఫరాబాద్‌కు షహబాజ్ షరీఫ్ గత బుధవారం ఉన్నత స్థాయి ప్రతినిధి బృందాన్ని పంపారు. వారు జేకేజేఏఏసీ నేతలతో రెండు రోజుల పాటు చర్చలు జరిపి ఒక ఒప్పందానికి వచ్చారు. దీని ప్రకారం పాక్ ప్రభుత్వం పీవోకేలోని ముజఫరాబాద్, పూంచ్‌లలో అదనంగా ఇంటర్మీడియట్, సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డులను ఏర్పాటుచేస్తుంది.
అలాగే, ప్రజలకు ఉచిత వైద్యం అందించేందుకు స్థానిక ప్రభుత్వం 15 రోజుల్లోగా హెల్త్ కార్డు అమలుకు నిధులు మంజూరు చేయాలి. పీఓకేలో విద్యుత్ వ్యవస్థను మెరుగుపరచడానికి నిధులు అందించాలి. పీఓకే అసెంబ్లీ సభ్యుల అంశంపై న్యాయ, రాజ్యాంగ నిపుణులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీ చర్చించాలి. ఆస్తి బదిలీలపై పన్నును 3 నెలల్లోగా పంజాబ్ లేదా పంఖ్తుఖ్వాలతో సమానంగా తీసుకురావాలి. ఈ ఒప్పందాన్ని పర్యవేక్షించి అమలుచేయడానికి ఓ కమిటీని కూడా ఏర్పాటుచేస్తారు.


