
ఇజ్రాయెల్‌కు హమాస్ ప్రతిపాదన
వైమానిక దాడులను నిలిపేయాలి
మానవతా కారిడార్లు తెరవాలని డిమాండ్
కైరో: ఇజ్రాయెల్ కొన్ని షరతులను నెరవేరిస్తే, బందీలకు సహాయం అందించడానికి రెడ్ క్రాస్‌తో సమన్వయం చేసుకోవడానికి తాము సిద్ధమని హమాస్ ఆదివారం తెలిపింది. రెడ్‌క్రాస్‌తో ఏదైనా సమన్వయం కావాలనుకుంటే.. ఇజ్రాయెల్ శాశ్వతంగా మానవతా కారిడార్లను తెరవాలని, సహాయ పంపిణీ సమయంలో వైమానిక దాడులను నిలిపివేయాలని హమాస్ డిమాండ్ చేసింది. ఇజ్రాయెల్ అధికారుల ప్రకారం, గాజాలో ఇప్పుడు 50 మంది బందీలు మిగిలి ఉన్నారు. వారిలో 20 మంది మాత్రమే బతికే ఉన్నారని భావిస్తున్నారు. హమాస్ ఇప్పటివరకు, మానవతా సంస్థలు బందీలను సంప్రదించకుండా నిషేధించింది.
వారి పరిస్థితుల గురించి కుటుంబాలకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. కృశించిపోయిన ఇజ్రాయెల్ బందీ డేవిడ్ వీడియో హమాస్ విడుదల చేయగా.. ప్రపంచ దేశాల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. వీడియో.. ఇజ్రాయేలీలను భయభ్రాంతులకు గురి చేయగా.. ఫ్రాన్స్, జర్మనీ, యూకే, యూఎస్‌లు హమాస్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాయి. గాజాలో బందీల పరిస్థితిపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి మంగళవారం ఉదయం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనుందని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో హమాస్ తాజా ప్రతిపాదన తీసుకొచ్చింది.
దాదాపు రెండేళ్ల యుద్ధం తరువాత.. మానవతా విపత్తు ఎదుర్కొంటున్న గాజాకు ఇంధన సరఫరాను అనుమతించినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది.ఇంధన కొరత ఆసుపత్రుల కార్యకలాపాలకు ఆటంకం కలిగించడంతో పాటు ఆకలి మరణాలు పెరుగుతున్నాయనే భయాల మధ్య ఇజ్రాయెల్ ఈ సడలింపును జారీ చేసింది. ఆదివారం, రెండు ట్రక్కులు ఈజిప్ట్ నుంచి ఇజ్రాయెల్ నియంత్రణలో ఉన్న కారెం అబు సలేం క్రాసింగ్ ద్వారా గాజాలోకి ప్రవేశించాయి.
ఆసుపత్రులు, బేకరీలు, పబ్లిక్ కిచెన్‌లకు సహాయం చేయడానికి ఈ వారం చివరిలో మరో నాలుగు ట్యాంకర్లు యూఎన్ ఇంధనం వచ్చే అవకాశం ఉంది. ఆస్పత్రులు, బేకరీలు, పబ్లిక్ కిచెన్లు, ఇతర ముఖ్యమైన సేవల కార్యకలాపాలకు సహాయం చేయడానికి నాలుగు యూఎన్ ఇంధన ట్యాంకర్లు ప్రవేశించాయని సహాయాన్ని సమన్వయం చేసే ఇజ్రాయెల్ సైనిక సంస్థ సీఓజీఏటీ తెలిపింది. కాగా, గత 24 గంటల్లో గాజాలో ఆకలి లేదా పోషకాహార లోపంతో మరో ఆరుగురు మరణించారని దాని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి కరువు కారణంగా మరణించిన వారి సంఖ్య 175కి పెరిగింది. వీరిలో 93 మంది పిల్లలు ఉన్నారు.
4