
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోమారు పాలస్తీనా గ్రూప్ హమాస్‌ను హెచ్చరించారు. ఇజ్రాయెల్‌తో శాంతి ఒప్పందానికి త్వరపడి, అంగీకరించాలని లేదంటే గాజాలో మరింత విధ్వంసం జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు.యుద్ధ విరమణ విషయంలో హమాస్ త్వరగా నిర్ణయం తీసుకోవాలి.. లేకుంటే దానికి ఇచ్చిన అన్ని అవకాశాలు నిలిచిపోతాయి. గాజాలో మళ్లీ ఉద్రిక్తతలు తలెత్తితే సహించేదిలేదంటూ ట్రంప్ తన ట్రూత్ సోషల్ పేజీలోని ఒక పోస్టులో పేర్కొన్నారు.
బందీల విడుదల, శాంతి ఒప్పందానికి అనుగుణంగా ఇజ్రాయెల్ తాత్కాలికంగా బాంబు దాడులను ఆపివేసిందని ట్రంప్ పేర్కొన్నారు. తమ దేశ సీనియర్ రాయబారి ఒకరు బందీల విడుదల వివరాలను ఖరారు చేయడానికి ఈజిప్టుకు వెళుతున్నారని, ఇకపై ఇజ్రాయెల్‌తో పాటు శాంతి ప్రణాళికను అమలు చేయడంలో హమాస్ జాప్యం చేస్తే సహించబోమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు. బందీల విడుదలపై వివరాలను ఖరారు చేసేందుకు, ఇజ్రాయెల్, హమాస్ మధ్య వివాదాన్ని ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు రూపొందించిన ఒప్పందంపై చర్చించేందుకు అమెరికా రాయబారి స్టీవ్ విట్‌కాఫ్ ఈజిప్టుకు ప్రాంతానికి వెళుతున్నారని వైట్ హౌస్ అధికారి మీడియాకు తెలిపారు.
రెండేళ్లుగా కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించే ప్రణాళికకు పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ శుక్రవారం సానుకూలంగా స్పందించింది. బందీలను విడుదల చేయడానికి, ఒప్పంద వివరాలను చర్చించేందుకు సిద్ధంగా ఉందని పేర్కొంది. ఇదే సమయంలో యుద్ధంలో దెబ్బతిన్న భూభాగంపై బాంబు దాడులను వెంటనే నిలిపివేయాలని ట్రంప్ ఇజ్రాయెల్‌కు పిలుపునిచ్చారు. అయితే ఇజ్రాయెల్ దళాలు ట్రంప్ మాటను ఉల్లంఘిస్తూ గాజాలో దాడులకు దిగాయి. ఇజ్రాయెల్ దాడుల్లో 57 మంది మృతిచెందారని, వారిలో ఒక్క గాజా నగరానికి చెందినవారే 40 మంది ఉన్నారని ఎన్క్లేవ్ పౌర రక్షణ సంస్థ తెలిపింది.