
పాలనా బాధ్యతలను కూడా అప్పగిస్తాం
ట్రంప్ ప్రణాళికపై హమాస్ సానుకూల స్పందన
కొన్ని అంశాలపై చర్చల అవసరముందంటూ మెలిక
ట్రంప్ ప్రణాళిక మొదటి దశ అమలుకు ఏర్పాట్లు చేపట్టాం
గాజా వ్యాప్తంగా దాడులు నిలిపివేశాం..
ప్రకటించిన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ
గాజా స్ట్రిప్: హమాస్ అంతమే లక్ష్యంగా రెండేళ్లుగా గాజాపై ఇజ్రాయెల్ ఆర్మీ సాగిస్తున్న దాడుల పరంపర ముగింపునకు వచ్చిన జాడలు కనిపిస్తున్నాయి. ఈ దిశగా శనివారం కీలక పరిణామాలు సంభవించాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 20 అంశాల ప్రణాళిక మేరకు తమ వద్ద ఉన్న బందీలందరి విడుదలకు సిద్ధంగా ఉన్నట్లు హమాస్ ప్రకటించగా గాజాలో యుద్ధానికి ముగింపు పలుకుతూ ట్రంప్ ప్రణాళిక మొదటి దశ అమలుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ తెలిపారు. గాజాలోని తమ బలగాలు ఇప్పుడు కేవలం ఆత్మరక్షణ చర్యలకే పరిమితమయ్యాయని ఇజ్రాయెల్ ఆర్మీ తెలిపింది. దాడులు జరపడం లేదంది. అయితే, గాజా నుంచి బలగాలను మాత్రం ఉపసంహరించుకోవడం లేదని స్పష్టం చేసింది.
కీలక పరిణామం
బందీలందరినీ విడుదల చేయడంతోపాటు గాజాలో అధికారాన్ని స్వతంత్ర రాజకీయ పాలస్తీనా గ్రూపులకు అప్పగించడానికి సిద్ధమని హమాస్ ప్రకటించడాన్ని కీలకమైన పరిణామంగా భావిస్తున్నారు. అయితే, ట్రంప్ ప్రణాళికలోని ఇతర అంశాలపై పాలస్తీనా గ్రూపులతో సంప్రదింపులు జరపాల్సి ఉంటుందని హమాస్ పేర్కొంది. కొన్నిటిపై మరిన్ని విస్తృత చర్చలు అవసరమవుతాయని కూడా పేర్కొంది. గాజా భవిష్యత్తును పాలస్తీనియన్లే చర్చించి నిర్ణయించుకోవాల్సి ఉందని తెలిపింది.
ఈ విషయంలో విదేశీ జోక్యాన్ని గట్టిగా వ్యతిరేకిస్తున్నామంది. అయితే, హమాస్ ఆయుధాలను అప్పగించాలన్న ఇజ్రాయెల్ కీలక డిమాండ్ ప్రస్తావన ఇందులో లేకపోవడం గమనార్హం. ఇజ్రాయెల్‌కు అనుకూలంగా ఉన్న ట్రంప్ ప్రతిపాదనలను చర్చలు జరపకుండా ఆమోదించలేమని హమాస్ సీనియర్ అధికారి మౌసా అబూ మెర్జౌక్ వ్యాఖ్యానించారు. అదేవిధంగా, బందీలందరినీ 72 గంటల్లోగా విడుదల చేయడం సాధ్యం కాదన్నారు. వారందరినీ ఒకే చోటకు చేర్చేందుకు రోజులు లేక వారాలు పట్టొచ్చని చెప్పారు. ఆయుధాలను అప్పగించే హమాస్ సిద్ధంగానే ఉందన్నారు. అయితే, హమాస్ విడుదల చేసిన అధికార ప్రకటనలో మాత్రం ఆయుధాల అప్పగింత విషయం లేకపోవడం గమనార్హం.
బాంబింగ్ ఆపేయాలి: ట్రంప్
హమాస్ ప్రకటనను ట్రంప్ స్వాగతించారు. ‘శాశ్వత శాంతిని హమాస్ కోరుకుంటోందని అనుకుంటున్నా. గాజాపై బాంబింగ్‌ను ఇజ్రాయెల్ వెంటనే నిలిపివేయాలి. బందీలందరినీ తక్షణమే సురక్షితంగా తీసుకురావడానికి ఇదెంతో అవసరం. ఇప్పటికే ఎంతో ఆలస్యమైంది. మిగతా అంశాలపై చర్చలకు సిద్ధం’అని తన ట్రూత్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు.
శాంతి నెలకొంటుందా?
తన శాంతి ప్రణాళిక పూర్తిస్థాయి అమలుపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం పూర్తి నమ్మకంతో ఉన్నట్లు కనిపించడం లేదు. ‘చూద్దాం.. ఏం జరుగుతుందో..మనమైతే ఒక స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకున్నాం. స్పష్టంగా చెప్పాం’అని ఆయన వ్యాఖ్యానించడం దీనికి అద్దం పడుతోంది. ‘ఈ ఒప్పంద ఫలితంగా గాజాలో కొన్ని రోజులపాటు ఇజ్రాయెల్ కాల్పు లను ఆపేస్తుంది. బందీలను హమాస్ విడుదల చేస్తుంది. హమాస్ ఆయుధాలను అప్పగించకుంటే మాత్రం ఇజ్రాయెల్ తిరిగి దాడులు మొదలుపెడుతుంది’అని ఇజ్రాయెల్ మాజీ సైనికాధికారి ఒకరు పేర్కొన్నారు. హమాస్ చర్చలకు సిద్ధమని ప్రకటించిందే గానీ, ఆ సంస్థ డిమాండ్లలో మాత్రం ఎటువంటి మార్పు లేదని మరో పరిశీలకుడు తెలిపారు. రెండు వర్గాల మాటలకు, చేతలకు ఏమాత్రం పొంతన లేదని విశ్లేషించారు.