
ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లోదిమిర్ జెలెన్‌స్కీతో భేటీ అనంతరం.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. త్వరలోనే రష్యా అధ్యక్షుడు పుతిన్, జెలెన్‌స్కీ ఇరువురు సమావేశమయ్యేందుకు అమెరికా ఏర్పాట్లు చేస్తోందంటూ పేర్కొన్నారు. సుమారు నాలుగేళ్ల యుద్ధాన్ని ముగించేందుకు ఇది కీలక అడుగుగా అభివర్ణించిన ఆయన.. దీర్ఘకాలికశాంతి కోసం ప్రయత్నిస్తామన్నారు.
‘‘ వైట్‌హౌస్‌లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్, ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని, యూకే ప్రధాని కీర్ స్టార్మర్, జర్మనీ ఛాన్స్‌లర్ ఫ్రెడిరిక్ మెర్జ్, యూరోపియన్ కమిషన్ ఉర్సులా వాండెర్‌లెయన్, నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టెతో జరిగిన చర్చలు అద్భుతంగా ముగిశాయి. వాషింగ్టన్ సమన్వయంతో యూరోపియన్ దేశాలు ఉక్రెయిన్‌కు భద్రతా హామీలు అందించాలనే దానిపైనే చర్చలు ప్రధానంగా సాగాయి.
రష్యా, ఉక్రెయిన్‌లతో శాంతి నెలకొనబోతుందనే విషయంపై నేతలందరూ సంతోషం వ్యక్తం చేశారు. చర్చల ముగింపులో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో నేను ఫోన్ కాల్‌లో మాట్లాడాను. జెలెన్‌స్కీ, పుతిన్ మధ్య భేటీ నిర్వహించేందుకు ఏర్పాట్లు మొదలయ్యాయి. వీరి భేటీ ఎక్కడ జరగాలనేదానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. వీరి సమావేశం ముగిసిన తర్వాత వారితో కలిసి నేను భేటీ అవుతాను. సుమారు నాలుగేళ్ల యుద్ధం ముగించేందుకు ఇదొక మంచి ముందడుగు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో, ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్ సమన్వయంతో రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య సమావేశం జరగనుంది’’ అని ట్రంప్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు.
అయితే భేటీ ఎప్పుడు.. ఎక్కడ నిర్వహిస్తారనేదానిపై మాత్రం ఆయన స్పష్టత ఇవ్వలేదు. మరోవైపు.. వైట్‌హౌజ్‌లో ట్రంప్-జెలెన్‌స్కీ, ఈయూ నేతల భేటీపై రష్యా ఇంకా స్పందించాల్సి ఉంది.
అంతకు ముందు.. భేటీ ముగిశాక ట్రంప్‌తో జరిగిన చర్చలపై జెలెన్‌స్కీ సంతోషం వ్యక్తం చేశారు. చాలా నిర్మాణాత్మకంగా భేటీ జరిగిందని.. భద్రతా హామీలతో సహా పలు సున్నిత విషయాలపై మాట్లాడినట్లు తెలిపారు. త్రైపాక్షిక భేటీకి తాము సిద్ధమేనంటూ పేర్కొన్నారాయన. అదే సమయంలో జెలెన్‌స్కీతో పాటు వచ్చిన యూరోపియన్ నేతలు ట్రంప్‌తో చాలా కీలక విషయాలపై చర్చించారు.
ఎవరేమన్నారంటే..
రష్యా, ఉక్రెయిన్, అమెరికా మధ్య త్రైపాక్షిక సమావేశం, సెక్యూరిటీ గ్యారంటీలు చర్రితలో నిలిచిపోయే కీలక ముందడుగుగా బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ అభివర్ణించారు.
రష్యాతో సమావేశానికి ముందే కాల్పుల విరమణ జరగాలని జర్మన్ ఛాన్స్‌లర్ ఫ్రెడరిక్ మెర్జ్ పేర్కొన్నారు. కాల్పుల విరమణ ఒప్పునేందుకు రష్యాపై ఒత్తిడి తేవాలని పేర్కొన్నారు.
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ మాట్లాడుతూ.. ట్రంప్ త్రైపాక్షిక సమావేశంపై చర్చించారని, అయితే దీన్ని విస్తృతం చేసి యురోపియన్ నేతను ఆ భేటీకి అనుమతించాలని ప్రతిపాదించారు. ఇది యూరప్ మొత్తానికి సంబంధించిన విస్తృత భద్రతా హామీలను పరిష్కరించడానికి ఉపయోగపడుతుందన్నారు.
ఇటలీ ప్రధాని జార్జియా మెలోని మాట్లాడుతూ ఈ వివాదం మళ్లీ తలెత్తకుండా ఎలా నిర్ధారించుకోవాలని ప్రశ్నించారు. శాంతి ఒప్పందానికి ఇది ముందస్తు షరతు అని పేర్కొన్నారు.
ఉక్రెయిన్ మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసే దాడులను అడ్డుకోవాలని అందుకు మిత్రపక్షాలు కలిసిరావాలని నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టె పేర్కొన్నారు.
ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించే దిశగా చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఇదివరకే రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ట్రంప్ చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. అయితే ఇరు దేశాల నేతల ప్రకటనలతో.. ఆ చర్చల్లో అంతగా పురోగతి కనిపించలేదన్న విమర్శ వినిపించింది. పైగా అలస్కా భేటీలో పుతిన్ పెట్టిన భూభాగాల మార్పిడి షరతును జెలెన్‌స్కీ వ్యతిరేకించడంతో.. వైట్‌హౌజ్ చర్చలూ విఫలం కావొచ్చని అంతా భావించారు. అదే సమయంలో.. ఈ ఏడాదిలోనే వైట్‌హౌజ్‌లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి చేదు అనుభవం ఎదురైంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌లు జెలెన్‌స్కీ విరుచుకుపడ్డారు. ఈ తరుణంలో అంచనాలకు భిన్నంగా తాజా భేటీ ప్రశాంత వాతావరణంలో.. అదీ యూరోపియన్ నేతల సమక్షంలో జరగడం గమనార్హం.