
వైట్‌హౌజ్ వేదికగా.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీల మధ్య జరిగిన శాంతి చర్చలలో ఆసక్తికర ఘటనలు చోటు చేసుకున్నాయి. జెలెన్‌స్కీ సూట్ అద్భుతంగా ఉందంటూ అమెరికా మీడియా ప్రతినిధులు పేర్కొనగా.. తాను అదే చెప్పానంటూ ట్రంప్ అనడంతో నవ్వులు విరబూశాయి.
మూడున్నరేళ్లుగా కొనసాగుతున్న ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేందుకు సోమవారం ఒవెల్ ఆఫీస్‌లో ట్రంప్-జెలెన్‌స్కీ, ఈయూ దేశాధినేతల మధ్య జరిగిన తాజా భేటీ పూర్తిగా ఆహ్లాదకరమైన వాతావరణంలో కొనసాగింది. అధ్యక్షులు ఇద్దరూ యుద్ధం ముగింపు ప్రయత్నాలపై సానుకూల ప్రకటనలు చేశారు. ఈ క్రమంలో..
‘‘ఈ సూట్‌లో మీరు అద్భుతంగా కనిపిస్తున్నారు. బాగున్నారు’’ అని గతంలో జెలెన్‌స్కీని విమర్శించిన బ్రియాన్ గ్లెన్ ప్రశంసలు కురిపించడం విశేషం. ట్రంప్ వెంటనే జోక్యం చేసుకొని.. గతంలో మీపై మాటలతో దాడి చేసింది కూడా ఈ విలేకరేనని చెప్పారు. ‘‘అవును నాకు గుర్తుంది’’ అని జెలెన్‌స్కీ బదులిచ్చారు. ఆ వెంటనే ‘మీరు అదే సూట్‌లో ఉన్నారు. నేను మాత్రం మార్చుకున్నాను’ అని గ్లెన్‌ను ఉద్దేశిస్తూ జెలెస్కీ చెప్పడంతో ట్రంప్‌తో పాటు అక్కడ ఉన్నవారంతా నవ్వుల్లో మునిగిపోయారు.
Brian Glenn: President Zelenskyy, you look fabulous in that suit
Zelenskyy: You are in the same suit. I changed, you did not. pic.twitter.com/A6556L1G1M— Acyn (@Acyn) August 18, 2025
ఈ ఏడాది ఫిబ్రవరిలో ట్రంప్‌జెలెన్‌స్కీలు వైట్‌హౌస్‌లో భేటీ అయిన విషయం తెలిసిందే. ఆ సమావేశం వాడీవేడిగా జరగడంతో అప్పుడు జెలెన్‌స్కీ వేసుకున్న డ్రెస్‌పై అమెరికా అధ్యక్షుడు సహా అక్కడి మీడియా విమర్శలు గుప్పించింది. టీ షర్టుతోనే వైట్‌హౌస్‌లో అధికారిక భేటీలో పాల్గొనడం విమర్శలకు కారణమైంది. ఆక్రమంలో కన్జర్వేటివ్ రిపోర్టర్ బ్రియాన్ గ్లెన్.. ‘‘మీరెందుకు సూట్ వేసుకోలేదు? దేశంలోనే అత్యున్నత కార్యాలయాన్ని మీరు గౌరవించడం లేదని అనేకమంది అమెరికన్లు అనుకుంటున్నారు. అసలు మీకు సొంత సూట్ ఉందా?’’ అని జెలెన్‌స్కీని నేరుగా ప్రశ్నించారు. దానికి జెలెన్‌స్కీ బదులిస్తూ.. యుద్ధం ముగిసిన తర్వాత సూట్ వేసుకుంటానని వివరించారు. ఇక..

తాజా భేటీలో.. జెలెన్‌స్కీ భార్య ఒలెనా జెలెన్‌స్కా (Olena Zelenska) రాసిన ఓ లేఖను ట్రంప్‌కు బహుకరించారు. ‘‘ఇది నా సతీమణి, ఉక్రెయిన్ ప్రథమ మహిళ రాసిన లేఖ. కానీ, ఇది మీకు కాదు.. మీ భార్య కోసం’’ అనడంతో అక్కడ నవ్వులు విరబూశాయి. రాజకీయాల్లోకి రాకముందు జెలెన్‌స్కీ సినిమాలు, స్టేజ్ షోల్లో నటించేవారు. అలాగే.. ఒలెనా ఒక రచయిత్రిగా, సామాజిక కార్యకర్తగా గుర్తింపు పొందారు.