
న్యూఢిల్లీ: భారత్- చైనా సంబంధాలు ఉద్రిక్తతల దశ నుంచి సాధారణ స్థాయికి క్రమంగా చేరుకుంటున్నాయి. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి న్యూఢిల్లీలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా వాంగ్ యి తమ దేశం భారత్‌కు అవసరమైన ఎరువులు, అరుదైన భూ ఖనిజాలు, టన్నెల్ బోరింగ్ యంత్రాలు (టీబీఎం) సరఫరాను తిరిగి ప్రారంభిస్తుందని హామీ ఇచ్చారు.
గత నెలలో జైశంకర్ తన చైనా పర్యటనలో.. యూరియా, అరుదైన భూ ఖనిజాలు, టీబీఎం సరఫరాల అంశాన్ని చైనా మంత్రి వాంగ్ యి దగ్గర ప్రస్తావించారు. దీనికి ఇప్పుడు చైనా మంత్రి సానుకూలంగా స్పందించారు. కాగా తైవాన్ విషయంలో భారత వైఖరిలో ఎటువంటి మార్పు లేదని విదేశాంగ మంత్రి జైశంకర్ చైనా ప్రతినిధి ఎదుట స్పష్టం చేశారు.
చైనా ఏడాదిగా భారత దిగుమతులపై బ్రేక్ వేసింది. అయితే ఇప్పుడు తాజాగా చైనా తమ దేశపు ఎరువులు, టీబీఎం, అరుదైన భూ ఖనిజాలను సరఫరా చేయడానికి అంగీకరించడం ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గుతున్నాయడానికి ఉదాహరణగా నిలిచింది. ఇకపై చైనా దాదాపు 30 శాతం ఎరువులను భారతదేశానికి సరఫరా చేయనుంది. అలాగే అరుదైన భూ ఖనిజాలను పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి టన్నెల్ బోరింగ్ యంత్రాలను సరఫరా చేయనుంది.
జైశంకర్-వాంగ్ సమావేశంలో సరిహద్దులకు సంబంధించిన చర్చలేవీ జరగలేదు. దీనిపై ఎన్‌ఎస్‌ఏ అజిత్ దోవల్ చర్చించనున్నారని సమాచారం. వీరి భేటీ ప్రధానంగా 3488 కి.మీ వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఏసీ)పై బలగాల తీవ్రతను తగ్గించడంపై దృష్టి పెట్టనుంది. లడఖ్‌లో సరిహద్దు ఘర్షణ,పెట్రోలింగ్ సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదు. భారత్- చైనా సైన్య బలగాలు ఇప్పటికీ సరిహద్దుల్లో మోహరించి ఉన్నాయి.