భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ పోలాండ్‌కు కీలక సూచన చేశారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దేశానికి ఎటువంటి మద్దతు ఇవ్వకూడదని తెలిపారు. ఉగ్రవాదంపై ఖచ్చితంగా జీరో టోలరెన్స్ విధానాన్ని పాటించాలని పరోక్షంగా పాకిస్థాన్‌ను ఉద్దేశించి జైశంకర్
పోలాండ్ ఉపప్రధానితో మాట్లాడారు.
పోలాండ్ విదేశాంగశాఖ మంత్రి రాడోస్లావ్ సిక్రోస్కీ,తో జైశంకర్ ఈ రోజు ( సోమవారం) సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మంత్రులు పలు ద్వైపాక్షిక అంశాలు చర్చించారు. ఈ సందర్భంగా జైశంకర్ మాట్లాడుతూ ఉగ్రవాదంపై జీరో టోలరెన్స్ విధానాన్ని పాటించాలని ముష్కరులను పెంచి పోషిస్తున్న దేశాలలో మౌలిక సదుపాయాల నిర్మాణానికి ఎటువంటి సహాయం చేయకూడదని తెలిపారు.
జైశంకర్ మాట్లాడుతూ.."ఉపప్రధాని మీరు మాకు దూరమైన వ్యక్తి కాదు . మా ప్రాంతంలో జరుగుతున్న సీమాంతర ఉగ్రవాదంపై మీకు అవగాహన ఉంటుంది. ఇప్పుడు మనం చర్చించిన అంశం ఇటీవల మీరు పర్యటించిన ఓ దేశానికి సంబందించింది. పోలాండ్ టెర్రరిజానికి మద్దతివ్వకూడదు. ఉగ్రవాదానికి సహకరిస్తున్న దేశంలో మౌలిక సదుపాయాల నిర్మాణం చేపట్టకూడదు" అని అన్నారు.
పోలాండ్ దేశంతో జరిగిన భేటీ అంశాలను తన ఎక్స్ ఖాతాలో జైశంకర్ పంచుకున్నారు. భారత విదేశాంగ శాఖ మంత్రి వ్యాఖ్యలకు పోలాండ్ ఉప ప్రధాని అంగీకారం తెలుపుతున్నట్లుగా తల ఊపారు. పహల్గామ్ అటాక్ అనంతరం పాకిస్థాన్ ఉగ్రవాదులకు మద్దతిస్తున్న అంశాన్ని భారత్ ఈయూ దేశాలకు వివరిస్తూ వస్తుంది.


