
వాషింగ్టన్ డీసీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు నోబెల్ శాంతి బహుమతిని ఇవ్వాలంటూ ఆయన మద్దతుదారులు, నమ్మకస్తులైన చట్టసభ సభ్యులు చాలాకాలంగా కోరుతూ వస్తున్నారు. ఇందుకు అనుగుణంగా వారు తమ నామినేషన్లను కూడా సమర్పించారు. ఇదే సమయంలో ట్రంప్ తనకు ఈ ప్రతిష్టాత్మ అవార్డు అందకపోవడంపై విచారం వ్యక్తం చేస్తున్నారంటూ పలు వార్తలు కూడా వినిపించాయి.
తాజాగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు నోబెల్ బహుమతి కమిటీకి అధ్యక్షుడు ట్రంప్‌ను నామినేట్ చేస్తూ ఒక లేఖ రాశారు. శాంతిని నెలకొల్పడంలో ట్రంప్ తన పాత్రను సమర్థవంతంగా నిర్వహించినందుకు ఆయనను నామినేట్ చేస్తున్నట్లు నెతన్యాహు ఆ లేఖలో పేర్కొన్నారు. సోమవారం వైట్ హౌస్‌లో జరిగిన విందు కార్యక్రమంలో నెతన్యాహు తాను బహుమతి కమిటీకి పంపిన నామినేషన్ లేఖ కాపీని కూడా మీడియాకు అందజేశారు.
‘అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే ఎన్నో ఘనమైన పురస్కారాలను, అవార్డులను అందుకున్నారు. ఇరు దేశాల మధ్య ఆయన శాంతిని నెలకొల్పారు. అందుకే నోబెల్ బహుమతి కమిటీకి ఆయనను నామినేట్ చేస్తూ లేఖ పంపాను. దీనిలో ఈ పురస్కారానికి అధ్యక్షుడు ట్రంప్ అర్హుడని తెలియజేశాను’ అని నెతన్యాహు పేర్కొన్నారు. మిడిల్ ఈస్ట్‌లో శాంతిభద్రతలు నెలకొల్పేందుకు ట్రంప్ చేసిన ప్రయత్నాలను నెతన్యాహు ఆ లేఖలో ప్రశంసించారు. ట్రంప్ నాయకత్వం, న్యాయమైన లక్ష్యం కోసం చేస్తున్న ప్రయత్నాలు ఎంతో గొప్పవి. మధ్యప్రాచ్యంలో ఆయన శాంతిభద్రతలకు చేస్తున్న ప్రయత్నాలను ఇజ్రాయెలీయులకే కాకుండా పలువురు అభినందిస్తున్నారన్నారని నెతన్యాహు పేర్కొన్నారు.
చాలా కాలంగా తనను తాను శాంతి దూతగా అభివర్ణించుకుంటున్న ట్రంప్ తాజాగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు నామినేషన్ చూసి సంబరపడ్డారు. ఈ సందర్భంగా నెతన్యాహుకు కృతజ్ఞతలు చెబుతూ, ఇది చాలా అర్థవంతమైనదని పేర్కొన్నారు. కాగా ఇప్పటివరకూ ముగ్గురు అమెరికా అధ్యక్షులు నోబెల్ శాంతి బహుమతిని అందుకున్నారు. 1906లో థియోడర్ రూజ్‌వెల్ట్, 1919లో వుడ్రో విల్సన్, 2009లో బరాక్ ఒబామా ఈ పురస్కారాన్ని స్వీకరించారు.
ఇది కూడా చదవండి: Maharashtra: బాల్ థాక్రే పాత వీడియో వైరల్.. ‘హిందీ’పై ఏమన్నారు?