
పలువురు చిన్నారులు సహా 55 మంది మృతి
కైరో: గాజా నగరంపై శనివారం రాత్రంతా ఇజ్రాయెల్ ఆర్మీ వైమానిక దాడులను ఆపకుండా కొనసాగించింది. గాజా వ్యాప్తంగా జరిగిన దాడుల్లో చిన్నారులు సహా 55 మంది చనిపోయారు. ఒక్క గాజా నగరంలోనే 37 మంది అసువులు బాశారు. ఇక్కడి సబ్రా ప్రాంతంలోని నివాస భవనంపై జరిగిన దాడిలో కనీసం 25 మంది ప్రాణాలు కోల్పోయారు. శిథిలాల్లో చిక్కుకున్న 17 మందిని కాపాడారని, మరో 50 మంది వరకు లోపలే చిక్కుకుని ఉంటారని ఆందోళన వ్యక్తమవుతోంది.
శిథిలాల నుంచి ఆర్తనాదాలు వినిపిస్తున్నాయని, కాపాడేందుకు వెళ్లిన తమపై ఇజ్రాయెల్ డ్రోన్లు కాల్పులు జరుపుతున్నాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఘటనలో బాధితులంతా డొఘ్‌ముష్ కుటుంబీకులేనని చెప్పారు. కాగా, తమ దాడిలో మాజెద్ అబూ సెల్మియా అనే హమాస్ సాయుధ విభాగానికి చెందిన స్పైపర్ చనిపోయాడని ఇజ్రాయెల్ ఆర్మీ చేసిన ప్రకటనను ఆయన సోదరుడు, షిఫా ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ మహ్మద్ అబూ సెల్మియా ఖండించారు.
57 వయస్సున్న తన సోదరుడు హై బీపీ, డయాబెటిస్, దృష్టి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారన్నారు. అతడు స్పైపర్ కానే కాదని, ఇజ్రాయెల్ చెప్పేదంతా కట్టుకథేనని కొట్టిపారేశారు. అదేవిధంగా, ఇజ్రాయెల్ దాడుల్లో షిఫా ఆస్పత్రి నర్సుతోపాటు ఆయన భార్య, ముగ్గురు పిల్లలు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు సిబ్బంది తెలిపారు. గాజా ప్రాంతంపై ఇజ్రాయెల్ సాగిస్తున్న దాడులపై పోప్ లియో స్పందించారు.
గాజాలోని పాలస్తీనియన్లను తమ ఇళ్ల నుంచి బలవంతపు అజ్ఞాతంలోకి పంపిస్తోందంటూ వ్యాఖ్యానించారు. హింస, తీవ్ర ప్రతీకార చర్యల ఫలితంగా గాజా స్ట్రిప్‌కు భవిష్యత్తు లేకుండా పోయిందన్నారు. కాగా, పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తిస్తున్నట్లు యూకే, కెనడా, ఆ్రస్టేలియా ఆదివారం ప్రకటించాయి. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాలు మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుండగా ఈ పరిణామం చోటుచేసుకుంది. ఈ సమావేశాల్లో పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించే ప్రతిపాదనను ఆమోదించే అవకాశముంది.
వీడ్కోలు ఫొటో విడుదల చేసిన హమాస్
విధ్వంసం కొనసాగిస్తూ గాజా నగరాన్ని స్వా«దీనం చేసుకునేందుకు ఇజ్రాయెల్ ఒక వైపు తీవ్ర ప్రయత్నాలు చేస్తుండగా, హమాస్ మిలటరీ విభాగం కస్సమ్ బ్రిగేడ్ శనివారం తమ ఉన్న సజీవ, మృతి చెందిన 48 ఇజ్రాయెల్ బందీల చిత్రాలను ‘వీడ్కోలు ఫొటో’అంటూ విడుదల చేయడం సంచలనం రేపింది. ప్రతి ఫొటోకు దిగువన ‘రొన్ అరాడ్’అనే క్యాప్షన్ ఉంచింది. 1986లో లెబనాన్‌లో కనిపించకుండా పోయిన ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ కెపె్టనే రొన్ అరాడ్. బాంబు అనుకోకుండా పేలడంతో గాయపడి హెజ్బొల్లాకు పట్టుబడ్డాడు. ఆ తర్వాత రొన్ అరాడ్ జాడ తెలియకుండా పోయింది.
బందీల ఫొటోల దిగువన కస్సమ్ బ్రిగేడ్.. ‘కాల్పుల విరమణకు నెతన్యాహూ నిరాకరించడం, గాజా నగరాన్ని ఆక్రమించుకునే ప్రతిపాదనను బహిరంగంగా వ్యతిరేకించి, మిలటరీ ఆపరేషన్ సారథ్యం వహించేందుకు ఆర్మీ చీఫ్ ఈయల్ జమీర్ సిద్ధపడినందుకే బందీలకు వీడ్కోలు’అని పేర్కొంది. అయితే, హమాస్ చెరలో కనీసం 20 బందీలు సజీవంగానే ఉన్నారని ఇజ్రాయెల్ అధికారులు భావిస్తున్నారు. అయితే, సజీవంగా ఉన్న బందీల సంఖ్య 20 కంటే తక్కువగానే ఉంటుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడం గమనార్హం. బందీలందరినీ వెనక్కి తీసుకురావడం, హమాస్ అంతమే తమ లక్ష్యమని ట్రంప్, నెతన్యాహూ ప్రకటిస్తుండగా, గాజా నగరంలో సైనిక ఆపరేషన్ ఫలితంగా బందీల ప్రాణాలకు ముప్పు తప్పదని హమాస్ హెచ్చరిస్తోంది.