
మరో 31 మంది పాలస్తీనియన్లు మృతి
ట్రంప్ శాంతి ప్రతిపాదనపై అనుమానాలు
గాజా సిటీ: గాజా వ్యాప్తంగా మంగళవారం కూడా ఇజ్రాయెల్ దాడులు కొనసాగాయి. వైమానిక దాడులు, కాల్పుల ఘటనల్లో 31 మంది పాలస్తీనియన్లు చనిపోయినట్లు వివిధ ఆస్పత్రులు తెలిపాయి. నెట్‌జరిమ్ కారిడార్ వద్ద ఏర్పాటైన ఆహార పంపిణీ కేంద్రం వద్దకు చేరిన వారిపై ఇజ్రాయెల్ ఆర్మీ జరిపిన కాల్పుల్లో 17 మంది చనిపోగా 33 మంది గాయపడినట్లు అల్ ఔదా ఆస్పత్రి తెలిపింది. నుసెయిరత్ శరణార్థి శిబిరంలోని ఓ టెంటుపై జరిగిన మరో దాడిలో నలుగురు ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది. మువాసిలో శరణార్థులుండే రెండు టెంట్లపై ఇజ్రాయెల్ బాంబులు వేసింది.
ఒక ఘటనలో నలుగురు మహిళలు, చిన్నారి సహా ఏడుగురు, మరో ఘటనలో..ఏడు నెలల గర్భవతి, చిన్నారి సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. అయితే, గడిచిన 24 గంటల వ్యవధిలో గాజాలో 160కి పైగా హమాస్ లక్ష్యాలపై దాడులు జరిపి పలువురు మిలిటెంట్లను చంపామని, ఆయుధాల గిడ్డంగుల్ని, నిఘా పోస్టులను ధ్వంసం చేశామని ఇజ్రాయెల్ ఆర్మీ ప్రకటించింది. ఈ పరిణామం...గాజాలో రెండేళ్లుగా సాగుతున్న యుద్ధానికి ముగింపు పలుకుతామంటూ సోమవారం ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ సమక్షంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన శాంతి ప్రతిపాదనపై పాలస్తీనా ప్రజల్లో అనుమానాలు రేపుతోంది. ‘ఇది శాంతి ప్రణాళిక కాదు..లొంగుబాటు ప్రణాళిక. మమ్మల్ని మళ్లీ వలస పాలనలోకి నెట్టే ప్రయత్నం’అని ఆగ్రహం వ్యక్తం చేశారు.