
గాజా: గాజా సిటీతోపాటు గాజా స్ట్రిప్ వ్యాప్తంగా ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. ఆదివారం వివిధ ప్రాంతాలపై జరిగిన వైమానిక దాడులు, కాల్పుల ఘటనల్లో కనీసం 48 మంది చనిపోయినట్లు అల్‌జజీరా వార్తా సంస్థ తెలిపింది. వీరిలో 32 మంది గాజా నగరంపై జరిగిన దాడుల్లోనే ప్రాణాలు కోల్పోయారంది. గాజా సిటీలోని రెమాల్ ప్రాంతంలో ఉన్న కౌథర్ టవర్‌ను ఇజ్రాయెల్ ఆర్మీ ఆదివారం ఉదయం నేలమట్టం చేసింది.
గంట ముందు అందులోని వారిని ఖాళీ చేయాలంటూ ఇజ్రాయెల్ ఆర్మీ ఆన్‌లైన్ వేదికగా హెచ్చరికలు జారీ చేసింది. ఘటనలో కనీసం 12 మంది చనిపోయారు. షిఫా ఆస్పత్రి సమీపంలోని ఓ వాహనంతోపాటు డెయిర్ అల్ బలాహ్‌లోని టెంట్‌పై జరిగిన దాడుల్లో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు సహా 13 మంది ప్రాణాలు కోల్పోయారు. పోషకాహార లోపం సంబంధ కారణాలతో 24 గంటల వ్యవధిలో మరో ఇద్దరు ప్రాణాలొదిలారని ఆరోగ్య విభాగం తెలిపింది.