ఆరుగురు మృతి.. వెనిజులా డ్రగ్స్ ముఠా సభ్యులన్న హెగ్సెత్
వాషింగ్టన్: కరీబియన్ సముద్ర జలాల్లో డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఓ బోటుపై చేపట్టిన వైమానిక దాడిలో ఆరుగురు చనిపోయారని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ శుక్రవారం తెలిపారు. వీరంతా వెనిజులా జైలు నుంచి నడుస్తున్న ట్రెన్ డె అరాగ్వా గ్యాంగ్‌కు చెందిన వారేనన్నారు.
ఈ ప్రాంతంలోని నార్కో– టెర్రరిస్ట్ డ్రగ్స్ రవాణాదారులను అల్‌ఖైదా ఉగ్రవాదులుగానే భావిస్తామన్నారు. వారిని వెంటాడి వేటాడి చంపుతామని హెగ్సెత్ హెచ్చరించారు. తాజా ఘటనతో సెపె్టంబర్ నుంచి ఆ ప్రాంతంలో అమెరికా చేపట్టిన దాడుల్లో చనిపోయిన వారి సంఖ్య 43కు చేరుకుంది. ఇలా ఉండగా, దక్షిణ అమెరికా ప్రాంతంలోకి విమాన వాహక నౌకను పంపిస్తున్నట్లు రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ తెలిపారు.
గురువారం అమెరికా సైనిక సూపర్‌సోనిక్ హెవీ బాంబర్లు రెండు వెనిజులా తీరం వెంబడి చక్కర్లు కొట్టాయి. కరీబియన్ సముద్రం, వెనిజులా తీర వెంబడి అమెరికా బలగాల అసాధారణ మోహరింపులపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికాలో నార్కో టెర్రరిజమ్ ఆరోపణలను ఎదుర్కొంటున్న వెనిజులా అధ్యక్షుడు నికొలస్ మదురోను గద్దె దించే లక్ష్యంతోనే ఇవన్నీ చోటుచేసుకుంటున్నట్లు ఊహాగానాలు మొదలయ్యాయి. డ్రగ్స్ రవాణా ఒక కారణం మాత్రమే కాగా, ఆయా దేశాలను బెదిరించి దారికి తెచ్చుకోవడమే అమెరికా అసలు లక్ష్యమని పరిశీలకులు అంటున్నారు.


