మానసికంగా వేధిస్తున్న భర్త నుంచి విడిపోవచ్చు
భర్త అంగీకారం అవసరం లేదు
పాకిస్తాన్ సుప్రీంకోర్టు కీలక తీర్పు
ఇస్లామాబాద్: మహిళల హక్కుల విషయంలో పాకిస్తాన్ సుప్రీంకోర్టు కీలక తీర్పు ప్రకటించింది. ‘ఖులా’ద్వారా వివాహాన్ని రద్దు చేసుకొనే అధికారం మహిళలకు సైతం ఉందని తేలి్చచెప్పింది. భర్త శారీరకంగానే కాకుండా.. మానసికంగా కూడా వేధింపులకు గురిచేస్తే విడాకులు తీసుకోవచ్చని స్పష్టంచేసింది. ఖులా అనేది ఇస్లామిక్ ధర్మంలో ఒక భాగం. పురుషులకు తలాక్ హక్కు ఉన్నట్లుగానే మహిళలకు ఖులా హక్కు ఉంది.
ఖులా హక్కును పాక్ సుప్రీంకోర్టు గుర్తించింది. మహిళా న్యాయమూర్తులైన జస్టిస్ ఆయేషా ఎం.మాలిక్, జస్టిస్ నయీం అఫ్గాన్‌తో కూడిన ధర్మాసనం ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో శుక్రవారం పొందుపర్చారు. భర్త మానసికంగా వేధిస్తుండడంతో ఓ మహిళ అతడితో వివాహాన్ని రద్దుచేసుకున్నారు. అయితే, షెషావర్ హైకోర్టు ఆమె నిర్ణయాన్ని తిరస్కరించింది. వివాహాన్ని ఏకపక్షంగా రద్దు చేసుకోవడం కుదరదని, అందుకు భర్త అంగీకారం కూడా ఉండాలని పేర్కొంది.
దాంతో పెషావర్ హైకోర్టు ఉత్తర్వును సవాలు చేస్తూ దాంతో బాధితురాలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆమె పిటిషన్‌పై ధర్మాసనం విచారణ చేపట్టింది. పెషావర్ హైకోర్టు ఉత్తర్వును తప్పుపట్టింది. ఖులా అనేది మహిళల హక్కు అని, విడాకులు పొందాలనుకుంటే భర్త అంగీకారం అవసరం లేదని స్పష్టంచేసింది. క్రూరత్వం అనేది భౌతికమైన హింస రూపంలోనే కాకుండా మానసికంగానూ ఉండొచ్చని వెల్లడించింది. మానసికంగా హింసిస్తున్న భర్త నుంచి ఖులా ద్వారా విడిపోవచ్చని, అతడితో జరిగిన పెళ్లిని రద్దు చేసుకోవచ్చని ధర్మాసనం తీర్పు వెలువరించింది.


