breaking news
khula divorce
-
‘ఖులా’ ద్వారా పెళ్లి రద్దు
ఇస్లామాబాద్: మహిళల హక్కుల విషయంలో పాకిస్తాన్ సుప్రీంకోర్టు కీలక తీర్పు ప్రకటించింది. ‘ఖులా’ద్వారా వివాహాన్ని రద్దు చేసుకొనే అధికారం మహిళలకు సైతం ఉందని తేలి్చచెప్పింది. భర్త శారీరకంగానే కాకుండా.. మానసికంగా కూడా వేధింపులకు గురిచేస్తే విడాకులు తీసుకోవచ్చని స్పష్టంచేసింది. ఖులా అనేది ఇస్లామిక్ ధర్మంలో ఒక భాగం. పురుషులకు తలాక్ హక్కు ఉన్నట్లుగానే మహిళలకు ఖులా హక్కు ఉంది. ఖులా హక్కును పాక్ సుప్రీంకోర్టు గుర్తించింది. మహిళా న్యాయమూర్తులైన జస్టిస్ ఆయేషా ఎం.మాలిక్, జస్టిస్ నయీం అఫ్గాన్‌తో కూడిన ధర్మాసనం ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు వెబ్సైట్లో శుక్రవారం పొందుపర్చారు. భర్త మానసికంగా వేధిస్తుండడంతో ఓ మహిళ అతడితో వివాహాన్ని రద్దుచేసుకున్నారు. అయితే, షెషావర్ హైకోర్టు ఆమె నిర్ణయాన్ని తిరస్కరించింది. వివాహాన్ని ఏకపక్షంగా రద్దు చేసుకోవడం కుదరదని, అందుకు భర్త అంగీకారం కూడా ఉండాలని పేర్కొంది. దాంతో పెషావర్ హైకోర్టు ఉత్తర్వును సవాలు చేస్తూ దాంతో బాధితురాలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆమె పిటిషన్‌పై ధర్మాసనం విచారణ చేపట్టింది. పెషావర్ హైకోర్టు ఉత్తర్వును తప్పుపట్టింది. ఖులా అనేది మహిళల హక్కు అని, విడాకులు పొందాలనుకుంటే భర్త అంగీకారం అవసరం లేదని స్పష్టంచేసింది. క్రూరత్వం అనేది భౌతికమైన హింస రూపంలోనే కాకుండా మానసికంగానూ ఉండొచ్చని వెల్లడించింది. మానసికంగా హింసిస్తున్న భర్త నుంచి ఖులా ద్వారా విడిపోవచ్చని, అతడితో జరిగిన పెళ్లిని రద్దు చేసుకోవచ్చని ధర్మాసనం తీర్పు వెలువరించింది. -
ప్రెస్‌మీట్ పెట్టి భర్తకు షాకిచ్చిన మహిళ
లక్నో: దేశవ్యాప్తంగా ‘తలాక్’వివాదంపై చర్చ నడుస్తున్న సమయంలో తాజాగా ‘ఖులా’ తెరమీదికొచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో షాజదా ఖతూన్ అనే ముస్లిం మహిళ శనివారం ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసి తన భర్తకు ‘ఖులా’చెప్పి విడాకులు తీసుకున్న ఘటన సంచలనం సృష్టించింది. ప్రెస్మీట్లో విలేకరుల సమక్షంలో ఖులాపై సంతకం చేశారు. జుబెర్ అలీతో పెళ్లైన కొత్తలో కొన్ని రోజులు బాగానే ఉన్నా తర్వాత తనను హింసించడం మొదలుపెట్టాడని, ఈ విషయాన్ని ముస్లిం పెద్దలకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని షాజదా పేర్కొన్నారు. అందుకే తన భర్త నుంచి ‘ఖులా’(విడాకులు) తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు షాజదా తెలిపారు. అంతేకాకుండా ‘ఖులా’పై సంతకం చేసి నోటీసును తన భర్తకు పంపించినట్లు వెల్లడించారు. షాజదాకు ముస్లిం మహిళల లీగ్ ప్రధాన కార్యదర్శి నైష్ హసన్ మద్దతు ప్రకటించారు. మరోవైపు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఎగ్జిక్యూటివ్ సభ్యుడు మౌలానా ఖలీద్ రషీద్ ఫరంగి మహళి మాట్లాడుతూ.. ఖులా చెప్పి భర్త నుంచి విడాకులు పొందడం సరైన పద్ధతికాదని చెప్పారు. ఖులా ఇస్తున్నట్లు ముందుగా తన భర్తకు నోటీసు ఇవ్వాలని, ఇలాంటివి మూడు నోటీసులు పంపించిన తర్వాత స్పందించకపోతే విడాకులు ఇవ్వొచ్చని మౌలానా తెలిపారు.


