అడుగు దూరంలో ఉన్నాం.. ఇజ్రాయెల్‌ ప్రధాని వార్నింగ్‌ | Israel PM Benjamin Netanyahu Said One Step Away From Victory Over Gaza - Sakshi
Sakshi News home page

అన్ని దేశాలకు హెచ్చరిక.. ఇజ్రాయెల్‌ ప్రధాని సంచలన కామెంట్స్‌

Published Mon, Apr 8 2024 8:03 AM

Israel PM Benjamin Netanyahu One Step Away From Victory Over Gaza - Sakshi

జెరూసలేం: గాజాపై ఇజ్రాయెల్‌ దాడులు కొనసాగుతున్న వేళ ఆ దేశ ప్రధాన మంత్రి బెంజిమిన్‌ నెతన్యాహు సంచలన ప్రకటన చేశారు. గాజాతో జరుగుతున్న పోరులో తాము విజయం సాధించడానికి అడుగు దూరంలో ఉన్నామని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో హమాస్‌ వద్ద ఉన్న బంధీలను విడిచిపెట్టే వరకు సంధి ప్రసక్తే ఉండదని కుండబద్దలు కొట్టారు.

కాగా, గాజాలో ఇజ్రాయెల్‌ యుద్ధం మొదలై ఆరు నెలలు పూర్తైన నేపథ్యంలో ప్రధాని నెతన్యాహు నేతృత్వంలో కేబినెట్‌ సమావేశం జరిగింది. ఈ సందర్బంగా నెతన్యాహు మాట్లాడుతూ.. గాజాతో యుద్ధంలో విజయానికి అడుగు దూరంలోనే ఉన్నాం. ఇప్పటివరకు మనం చెల్లించిన మూల్యం ఎంతో బాధాకరమైంది, విచారకరం. ఒప్పందానికి సిద్ధమే, లొంగిపోవడానికి కాదు. అంతర్జాతీయంగా వస్తోన్న ఈ ఒత్తిడి ఇజ్రాయెల్‌పై చేసే బదులు.. దీనిని హమాస్‌ వైపు మళ్లించాలి. తద్వారా బందీలు త్వరగా విడుదలయ్యే అవకాశం ఉంటుంది. తమపై ఎవరు దాడి చేసినా, చేయాలని ప్రయత్నించినా.. వారిపై ప్రతిదాడులు తప్పవన్నారు. ప్రస్తుతం ఇదే కొనసాగుతోందని.. అన్ని వేళలా ఇదే సూత్రాన్ని ఆచరణలో పెడతామని అన్నారు.

ఇదిలాఉంటే, హమాస్‌ నిర్మూలనే లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్‌ దాడులు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్‌ దాడుల కారణంగా గాజాలో ఇప్పటికే వరకు దాదాపు 33వేల మంది మరణించినట్టు సమాచారం. యుద్ధం కారణంగా గాజాలో విపత్కర పరిస్థితుల నెలకొన్నాయి. ప్రస్తుతం ఇజ్రాయెల్‌-హమాస్‌ వరకు పరిమితమైన ఈ యుద్ధం.. ఇరాన్‌ జోక్యంతో మొత్తం పశ్చిమాసియాకు విస్తరించే ప్రమాదం ఉందని అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు.. కాల్పుల విమరణ ఒప్పందానికి సంబంధించిన చర్చలు అంతర్జాతీయ మధ్యవర్తుల సహకారంతో కైరోలో తిరిగి మొదలవుతాయని భావిస్తోన్న తరుణంలో నెతన్యాహు ఇలా కామెంట్స్‌ చేయడం ఆందోళన కలిగిస్తోంది. 

Advertisement
Advertisement