గాజాలో మళ్లీ బీభత్సం | Israel Moves Into Gaza Second Largest City And Intensifies Strikes In Bloody New Phase Of The War - Sakshi
Sakshi News home page

Israel-Hamas War Updates: గాజాలో మళ్లీ బీభత్సం

Dec 6 2023 4:03 AM | Updated on Dec 6 2023 9:56 AM

Israel intensifies strikes on Gaza second largest city - Sakshi

ఖాన్‌ యూనిస్‌: హమాస్‌తో కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిన తర్వాత గాజా స్ట్రీప్‌లో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. మళ్లీ యుద్ధ బీభత్సం స్పష్టం కనిపిస్తోంది. జనం చెల్లాచెదురవుతున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని సురక్షిత ప్రాంతాలను వెతుక్కుంటూ తరలివెళ్తున్నారు. హమాస్‌ మిలిటెంట్ల స్థావరాలు, మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ సైన్యం దాడులు తీవ్రతరం చేసింది. దక్షిణ గాజాలోని ఖాన్‌ యూనిస్‌ సిటీపై సోమవారం అర్ధరాత్రి తర్వాత  క్షిపణుల వర్షం కురిపించింది.

ఖాన్‌ యూనిస్‌లో ఇజ్రాయెల్‌ తాజా దాడుల్లో 43 మంది మరణించారని హమాస్‌ వెల్లడించింది. సాధారణ జనావాసాలపై దాడులు చేయలేదని, హమాస్‌ స్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నామని ఇజ్రాయెల్‌ ప్రకటించింది. ఉత్తర గాజాలో అతిపెద్ద జబాలియా రెఫ్యూజీ క్యాంప్‌ను తమ సైన్యం చుట్టుముట్టిందని ఇజ్రాయెల్‌ ప్రకటించింది. ఈ క్యాంప్‌లోపలి హమాస్‌ స్థావరాలను నేలమట్టం చేయబోతున్నామని వెల్లడించింది. గాజాలో ఇప్పుడు సురక్షిత ప్రాంతం అంటూ ఏదీ లేకుండాపోయిందని ‘యూనిసెఫ్‌’ ఆందోళన వ్యక్తం చేసింది. ఇక్కడ పరిస్థితి ప్రతి గంట గంటకూ దిగజారుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది.  

గాజాలో 15,899కి చేరిన మృతులు  
ఇజ్రాయెల్‌–హమాస్‌ మధ్య అక్టోబర్‌ 7న యుద్ధం మొదలైంది. ఇజ్రాయెల్‌ దాడుల్లో గాజాలో ఇప్పటివరకు 15,899 మంది మృతిచెందారని గాజా ఆరోగ్య శాఖ తెలిపింది. కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిన తర్వాత గత మూడు రోజుల వ్యవధిలోనే 700 మంది మరణించినట్లు తెలుస్తోంది.  

కలుగుల్లోని ఎలుకలను రప్పించినట్లు..  
గాజాలో హమాస్‌ మిలిటెంట్లు బలమైన సొరంగాల వ్యవస్థను నిర్మించుకున్నారు. అక్కడే వారి ఆయుధ నిల్వలు, కమ్యూనికేషన్‌ పరికరాలను ఏర్పాటు చేసుకున్నారు. ఈ కలుగుల్లో దాక్కొని ఇజ్రాయెల్‌ సైన్యంపై దాడులకు దిగుతున్నారు. అందుకే సొరంగాలను ధ్వంసం చేయడానికి , వాటిని సముద్రపు నీటితో నింపేయాలని  ఇజ్రాయెల్‌ రంగం సిద్ధం చేసింది. ఇందుకోసం నవంబర్‌లోనే అల్‌–షాతీ శరణార్థి శిబిరానికి మైలు దూరంలో 5 భారీ పంపులను ఏర్పాటు చేసినట్లు ఓ వార్తా సంస్థ వెల్లడించింది.

ఇవి గంటకు కొన్ని వేల క్యూబిక్‌ మీటర్ల నీటిని పంప్‌ చేస్తాయని, వారాల వ్యవధిలోనే సొరంగాలను నింపుతాయని పేర్కొంది. దీంతో సొరంగాలు పనికిరాకుండాపోతాయి. అందులోని ఆయుధాలు, కమ్యూనికేషన్‌ పరికరాలు నిరుపయోగంగా మారతాయని ఇజ్రాయెల్‌ అంచనా. సొరంగాల్లోని మిలిటెంట్లను అంతం చేయడం తేలికవుతుందని భావిస్తోంది. ఇలా ఉండగా, బందీలను సొరంగాల్లో మిలిటెంట్లు దాచిపెట్టిన సంగతి తెలిసింది. వారంతా విడుదలైన తర్వాత సొరంగాలను నీటితో నింపే ప్రణాళికలను అమలు చేస్తారా? లేక ముందే చేస్తారా? అనేది తెలియరాలేదు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement