ఇజ్రాయెల్ కీలక నిర్ణయం!.. హమాస్‌కు ఊరట లభించేనా?

Israel And Hamas Deal For Prisoners Swap - Sakshi

జెరూసలేం: హమాస్‌ మిలిటెంట్‌ సంస్థ నిర్మూలనే లక్ష్యంగా గాజాపై దాడులను ఇజ్రాయెల్‌ తీవ్రతరం చేస్తోంది. పదాతి దళం, సాయుధ వాహనాలు గాజావైపునకు దూసుకెళ్తున్నాయి. వాటికి దన్నుగా విమానాలు, యుద్ధ నౌకల నుంచి భారీ రాకెట్‌ దాడులు కొనసాగుతున్నాయి. హమాస్‌ నిర్మించుకున్న భూగర్భ సొరంగాలే లక్ష్యంగా బాంబుల వర్షం కురుస్తోంది. గాజాలో భూతల దాడులను మరింత తీవ్రంచేస్తామని ప్రకటించింది. ఇ‍జ్రాయెల్‌ దాడిలో ఇప్పటికే వేల సంఖ్యలో పౌరులు మృతిచెందారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు.

ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య రాజీ కుదుర్చేందుకు మధ్యప్రాశ్చ్య దేశాలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఇందులో భాగంగా ఇరుపక్షాలు కాల్పులు విరమించాలని, బంధీలుగా ఉన్న పౌరులను విడిచిపెట్టాలా రాజీకుదిర్చేలా యత్నిస్తున్నాయి. దీనికి హమాస్‌ వైపు నుంచి సానుకూల ప్రకటన వెలువడింది. ఖైదీల మార్పిడికి తాము సిద్ధంగా ఉన్నామని హమాస్‌ ప్రకటించింది. ప్రతిగా బంధీలుగా ఉన్న పాలస్తీనియన్లను విడిచిపెట్టాలని షరతు విధించింది. తమ వద్ద బంధీలుగా ఉన్న ఇజ్రాయెలీలను విడిచిపెడతామని ఎజ్జెడిన్ అల్-కస్సామ్ బ్రిగేడ్స్ ప్రతినిధి అబు ఒబెయిడా చెప్పారు. దీనికి బదులుగా ఇజ్రాయెల్‌ జైళ్లలో ఉన్న పాలస్తీనా ఖైదీలందరినీ విడుదల చేయాలన్నారు. అలా అయితే తక్షణమే ఖైదీల మార్పిడి ఒప్పందానికి సిద్ధమేనని స్పష్టం చేశారు.

మరోవైపు గాజాలో భూతల దాడులను మరింత తీవ్రం చేస్తామని ఇజ్రాయెల్‌ సైన్యం ప్రకటించింది. హమాస్‌ ఉగ్రవాదుల సొరంగాలు, కమ్యూనికేషన్‌ వ్యవస్థలపై విరుచుకుపడతామని తెలిపింది. ఉత్తర గాజాలో 150 సొరంగాలు, బంకర్లను ఇజ్రాయెల్‌ యుద్ధ విమానాలు ధ్వంసం చేశాయి. కమ్యూనికేషన్ల వ్యవస్థపై కూడా దాడులు చేయడంతో దాదాపు 23 లక్షల మంది ప్రజలు బయటి ప్రపంచంతో సంబంధాలను కోల్పోయారు. శాటిలైట్‌ ఫోన్లు మాత్రమే పని చేస్తున్నాయి. కాగా, ఇజ్రాయెల్‌ దాడులను సంపూర్ణ శక్తి సామర్థ్యాలతో ఎదుర్కొంటామని హమాస్‌ తెలిపింది.

7,700 దాటిన మృతులు
► అక్టోబర్‌ 7న మొదలైన ఇజ్రాయెల్‌–హమాస్‌ పోరాటంలో గాజాలో మృతి చెందిన పాలస్తీనియన్ల సంఖ్య ఇప్పటికే 7,700 దాటింది.
► వీరిలో చాలామంది బాలలు, మహిళలేనని పాలస్తీనా ప్రకటించింది.
► శుక్రవారం సాయంత్రం నుంచే కనీసం 550 మందికి పైగా మరణించినట్టు సమాచారం.
► గతంలో ఇజ్రాయెల్‌–హమాస్‌ మధ్య జరిగిన నాలుగు పోరాటాల్లోనూ కలిపి దాదాపు 4,000 మంది మరణించినట్టు అంచనా!
► అక్టోబర్‌ 7న హమాస్‌ జరిపిన మెరుపు దాడిలో 1,400 మంది దాకా ఇజ్రాయెలీలు మరణించడం తెలిసిందే. వీరిలో 311 మంది సైనికులని ప్రభుత్వం ప్రకటించింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top