
వాషింగ్టన్: ఇజ్రాయెల్–హమాస్ యుద్ధానికి తెరదించానని, బందీల విడుదల కోసం ఒప్పందం కుదిర్చానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ఇక తన మొత్తం దృష్టిని ఉక్రెయిన్–రష్యా యుద్ధాన్ని ముగించడంపైనే కేంద్రీకరించినట్లు తెలిపారు. రష్యాను చర్చల వేదికపైకి రప్పించడానికి ఉక్రెయిన్‌కు లాంగ్–రేంజ్ ఆయుధాలు అందజేసే అంశాన్ని పరిశీలిస్తానని అన్నారు.
రష్యా దాడులను తిప్పికొట్టడానికి దీర్ఘశ్రేణి క్షిపణులు ఇవ్వాలని ఉక్రెయిన్ సైన్యం ఎప్పటినుంచో అమెరికాను కోరుతోంది. ట్రంప్ బుధవారం శ్వేతసౌధంలో మీడియాతో మాట్లాడారు. ఉక్రెయిన్–రష్యా యుద్ధానికి ముగింపు పలుకుతానన్న విశ్వాసం ఉందన్నారు. శాంతి చర్చల కోసం ముందుకు రావాలని రష్యా అధినేత పుతిన్‌కు సూచించారు. లేకపోతే మరింత ఒత్తిడి పెంచక తప్పదని తేల్చిచెప్పారు.
మాట వినకపోతే మరిన్ని కఠిన ఆంక్షలకు సిద్ధంగా ఉండాలని పరోక్షంగా హెచ్చరించారు. తాను అధికారంలోకి వస్తే ఉక్రెయిన్–రష్యా యుద్ధాన్ని తక్షణమే ఆపేస్తానని గత ఏడాది ఎన్నికల ప్రచారంలో ట్రంప్ హామీ ఇచి్చన సంగతి తెలిసిందే. అయితే, అధికారంలోకి వచ్చి దాదాపు 10 నెలలవుతున్నా ఆయన తన హామీని నిలబెట్టుకోలేకపోయారు. ఉక్రెయిన్, రష్యా అధినేతలతో పలుమార్లు చర్చలు జరిగినప్పటికీ యుద్ధం మాత్రం ఆగడం లేదు.