టెహ్రాన్: మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను హతమార్చుతామని ఇరాన్ ప్రభుత్వ మీడియా సంస్థలు బహిరంగంగా ప్రసారం చేయడం ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపుతోంది.
2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన ట్రంప్ తృటిలో ప్రాణాలతో బయటపడ్డ ఘటన ఇంకా గుర్తుండగానే ఈ బెదిరింపు వెలువడింది. ఆ ఏడాది జూలై 14న పెన్సిల్వేనియాలో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ట్రంప్‌పై ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. ఆ కాల్పుల్లో ఆయన చెవికి గాయమైంది. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే రక్షణగా చేరి ఆస్పత్రికి తరలించారు. కాల్పులు జరిపిన దుండగుడిని భద్రతా బలగాలు అక్కడికక్కడే హతమార్చాయి.
ఇప్పుడు అదే ఘటనకు సంబంధించిన ఫొటోలు, విజువల్స్‌తో ఇరాన్ మీడియా కథనాలు ప్రసారం చేస్తూ..‘గతంలో బుల్లెట్ మిస్సైంది.. ఇక మిస్సవ్వదు, ఖచ్చితంగా లక్ష్యాన్ని తాకుతుంది’ అంటూ ట్రంప్‌ను బహిరంగంగా బెదిరించింది.
దాడులకు దిగితే ఇరాన్ ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటుందనే అంచనాతో అమెరికా అప్రమత్తమైంది. మధ్యప్రాచ్యంలో తన సైనిక స్థావరాలను ఖాళీ చేస్తోంది. ఈ తరుణంలో ఇరాన్ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. అమెరికా అధ్యక్షుడు ఇరాన్‌పై సైనిక దాడులు చేస్తున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో, టెహ్రాన్ ఇప్పటివరకు చేసిన అత్యంత బహిరంగ బెదిరింపులలో ఈ ప్రసారం ఒకటిగా నిలిచింది. అదే సమయంలో, అమెరికా తమ దేశంలో అంతర్గత అశాంతిని నెలకొల్పేందుకు ప్రయత్నిస్తోందని ఇరాన్ అధికారులు ఆరోపిస్తున్నారు.
ఇరాన్‌లో ఆర్థిక సంక్షోభం, నిరుద్యోగం, ప్రభుత్వ అవినీతి కారణంగా ప్రజలు పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి నిరసనలు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఇలాంటి ప్రకటనలు దేశంలో ఉద్రిక్తతను మరింత పెంచుతున్నాయి. ట్రంప్‌పై ఇరాన్ మీడియా చేసిన బెదిరింపులను ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి.


