హిజాబ్‌ చట్టానికి బ్రేక్‌ | Iran stops Implementation of Draconian Hijab Legislation | Sakshi
Sakshi News home page

హిజాబ్‌ చట్టానికి బ్రేక్‌

Dec 19 2024 6:19 AM | Updated on Dec 19 2024 6:19 AM

Iran stops Implementation of Draconian Hijab Legislation

నిరసనల నేపథ్యంలో ఇరాన్‌ నిర్ణయం 

ఇరాన్‌లో అత్యంత వివాదాస్పదమైన ‘హిజాబ్‌–పవిత్రత చట్టం’అమలుకు దేశ జాతీయ భద్రతా మండలి బ్రేకులు వేసింది. ఇరాన్‌ తీరు పట్ల ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఆ చట్టం అస్పష్టంగా ఉందని, దాన్ని సంస్కరించాల్సిన అవసరముందని అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్‌ అన్నారు. హిజాబ్‌ ధరించని మహిళలకు జరిమానాలతో పాటు 15 ఏళ్ల దాకా జైలు శిక్షకు చట్టం ప్రతిపాదించింది. పలు కఠినమైన శిక్షలు సూచించింది. 

హిజాబ్‌ విషయమై ఇరాన్‌లో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై పెజెష్కియాన్‌ గతంలోనూ అసహ నం వ్యక్తం చేశారు. ‘‘హిజాబ్‌ను బలవంతంగా తొలగించలేకపోయాం. దాన్ని ధరించాల్సిందేనంటూ మహిళల హక్కులను కాలరాసే అధికారం మాకు లేదు’’అని ఇటీవలి అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ఆయన పదేపదే పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఎన్నికల హామీని అమలు చేశారని భావిస్తున్నారు. మహిళా, కుటుంబ వ్యవహారాల మాజీ ఉపాధ్యక్షుడు మసౌమే ఎబ్టేకర్‌ కూడా ఈ చట్టాన్ని విమర్శించారు. ఈ చట్టాన్ని అమలు చేయడమంటే ఇరాన్‌లో సగం మందిపై అభియోగం మోపడమేనన్నారు. 

నిత్య వివాదం: హిజాబ్‌ వివాదం ఈనాటిది కాదు. మహిళలపై అణచివేతకు చిహ్నంగా ఉన్న హిజాబ్‌ను కొత్త తరం ధిక్కరిస్తూనే ఉంది. హిజాబ్‌ ధరించలేదని, వస్త్రధారణ అనుచితంగా ఉందని 2022లో మహసా అమీనీ అనే 22 ఏళ్ల కుర్దిష్‌ మహిళను ఇరాన్‌ నైతిక పోలీసులు అరెస్ట్‌ చేశారు. కస్టడీలో కోమాలోకి వెళ్లిన ఆమె తర్వాత ఆస్పత్రిలో ప్రాణాలు విడిచారు. ఆమె డాక్టర్‌ కావాలని కలలు కన్నారు. యూనివర్సిటీకి వెళ్లే ముందు వారం పాటు తల్లిదండ్రులతో ఉందామని వచ్చి ప్రాణాలొదిలారు. అమీనీ మరణంపై ఇరాన్‌వ్యాప్తంగా నిరసనలు చెలరేగాయి. 

మహిళలే గాక పురుషులు కూడా వాటిలో పాల్గొన్నారు. పోలీసుల చిత్రహింసలే ఆమెను పొట్టన పెట్టుకున్నాయంటూ దుయ్యబట్టారు. బలూచ్, అజెరిస్, అరబ్బులు కూడా కుర్దులతో కలిసి రోడ్డెక్కారు. సున్నీలు, షియాలని తేడా లేకుండా నిరసనల్లో పాల్గొన్నారు. వేలాది నిరసనకారులను పోలీసులు అరెస్టు చేశారు. ప్రభుత్వాన్ని ధిక్కరించిన, నిరసనల్లో పాల్గొన్న వారిలో 500 మంది మరణించారు. 120 మంది కంటి చూపు కోల్పోయారు. ఏడాదికి అలజడి తగ్గుముఖం పట్టాక దుస్తుల కోడ్‌ ఉల్లంఘించిన వారికి ప్రభుత్వం కఠిన శిక్షలు ప్రకటించింది. 

గాయని అరెస్టుతో: హిజాబ్‌ ధరించకుండా పాట పాడి, యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేసిన ఇరాన్‌ గాయని పరస్తూ అహ్మదీ (27)ని అధికారులు తాజాగా అరెస్ట్‌ చేశారు. భుజాలు కనిపించేలా స్లీవ్‌లెస్‌ డ్రెస్‌లో నలుగురు పురుష కళాకారుల మధ్య పాడిన ఆ వీడియో అందరినీ ఆకర్షించింది. ఆమెతో పాటు అందులో ఉన్నవారందరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాంతో మళ్లీ నిరసనలు మొదలయ్యాయి. 300 మందికి పైగా ఇరాన్‌ హక్కుల కార్యకర్తలు, రచయితలు, జర్నలిస్టులు కొత్త హిజాబ్‌ చట్టాన్ని బహిరంగంగా ఖండించారు. సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో అహ్మదీని మర్నాడే విడుదల చేశారు. నిరసనలు పెరిగి రెండేళ్ల నాటి పరిస్థితి పునరావృతమయ్యేలా ఉండటంతో హిజాబ్‌ చట్టం అమలును తాత్కాలికంగా నిలిపేస్తూ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది.     

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌ 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement