
సోషల్ మీడియాలో వెల్లువెత్తిన మీమ్స్
అన్యాయం! ఘోరం! ట్రంప్ గారికి నోబెల్ రాలేదు! నోబెల్ శాంతి బహుమతి 2025 ప్రకటించారు. డొనాల్డ్ ట్రంప్ గారికి మాత్రం దక్కలేదు! ఇందులో ఆశ్చర్యమేమీ లేదు, కానీ ఆ తర్వాత సోషల్ మీడియాలో వచి్చన మీమ్స్, జోకులు చూస్తే మాత్రం పగలబడి నవ్వకుండా ఉండలేం. ఈ వార్త వినగానే, ఏం జరిగిందో ఊహించగలం కదా? అవును, ట్రంప్ స్పందనను ఊహిస్తూ ‘క్లాస్ పీకుతున్న’మీమ్స్ సోషల్ మీడియాలో వెల్లువెత్తాయి.
మనసు గెలిచిన మచాడో..
ఈసారి బహుమతిని వెనెజులా ప్రతిపక్ష నాయకురాలు మారియా కొరినా మచాడో గెలుచుకున్నారు. ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడుతున్న ఈమెకు ‘వెనెజులా
ఉక్కు మహిళ’అనే పేరు కూడా ఉంది. ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నప్పటికీ, టైమ్ మ్యాగజైన్ ‘2025లో అత్యంత ప్రభావవంతమైన 100 మంది’జాబితాలో ‘మచాడో’పేరు ఉందంటే ఆమె ప్రభావాన్ని ఊహించుకోవచ్చు.
ట్రంప్ గారే టాక్ ఆఫ్ ది టౌన్!
కానీ, ఆన్‌లైన్‌లో జనాలు ‘మచాడో’గురించి మాట్లాడకుండా, కేవలం ట్రంప్ కలల బహుమతి గురించి మాత్రమే జోకులు వేసుకున్నారు. ట్రంప్ నోబెల్ గెలవనందుకు ఎంత నిరాశ చెందారో చూపిస్తూ.. ఎక్స్ ప్లాట్‌ఫాం నిండిపోయింది. ట్రంప్ చిన్న పిల్లాడిలా అలిగి, చిందులు తొక్కుతున్నట్లు మారి్ఫంగ్ చేసిన ఫొటోలు, ఆయనకు బహుమతి దక్కనందుకు ప్రపంచం అంతా పండుగ చేసుకుంటున్న వీడియోలు.. అబ్బో! నెటిజన్లు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా, ఈ అవకాశాన్ని ’ఇంటర్నెట్ గోల్డ్’గా మార్చడానికి అస్సలు ఆలస్యం చేయలేదు.
ట్రంప్ ‘శాంతి’ ప్రకటనలు: కామెడీకి కొత్త నిర్వచనం
నిజానికి, 2025 నోబెల్ శాంతి బహుమతి ప్రకటనకు ముందు, ట్రంప్ చాలా పకడ్బందీగా ప్రచారం కూడా చేశారు. ప్రపంచంలో అనేక శాంతి కార్యక్రమాలలో తన పాత్ర ఉందని, అందుకే ఈ గౌరవం తనకే దక్కాలని ఆయన పట్టుబట్టారు.
నిజమా?.. మీరే చేసారా?
ఆయన నోటి నుంచి ఈ మాటలు వస్తున్నప్పుడు, అంతర్జాతీయ నిపుణులు, విశ్లేషకులు ముఖాలు ఎలా పెట్టుకున్నారో ఊహించుకుంటే చాలు. అన్నీ విన్నాక, ‘నిజంగా మీరు ఇవన్నీ చేసేసారా?’అని అందరూ నవ్వుకుంటూనే ప్రశ్నించారట!. ఏదేమైనా, నోబెల్ శాంతి బహుమతి ఆయనకు దక్కకపోయినా, ఆయన వల్ల మాత్రం నెటిజన్లకు భారీ వినోదం మాత్రం దక్కింది.
ఆయన సొంత డబ్బా లిస్ట్ ఇదే..
→ ఇజ్రాయెల్–హమాస్, ఆర్మేనియా–అజర్‌బైజాన్ మధ్య కాల్పుల విరమణకు తానే మధ్యవర్తిత్వం వహించారట!
→ కంబోడియా–థాయిలాండ్ గొడవలు కూడా ఆయనే పరిష్కరించారట!
→ అంతేకాదు, ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్–పాకిస్తాన్ మధ్య కూడా శాంతి ఒప్పందానికి కృషి చేశానని చెప్పుకొన్నారు (అసలు అదెప్పుడు చేశారో ఎవరికీ తెలియదు).
→ ఇక, డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో–రువాండా, ఈజిప్ట్–ఇథియోపియా, సెర్బియా–కొసావో మధ్య ఉద్రిక్తతలు కూడా ఆయన వల్లే శాంతించాయట!