
కాపాడేందుకు చివరిదాకా ప్రయత్నం
ట్రంప్ నిబంధనలతో విధి లేక వేటు
ఆమె సేవలు ఎనలేనివంటూ ప్రశంస
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా డీఈఐ విభాగం చీఫ్ నీలా రాజేంద్ర ఉద్వాసనకు గురయ్యారు. డీఈఐ వంటి ఫెడరల్ ఏజెన్సీలను రద్దు చేస్తూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఇందుకు కారణమైంది. భారత మూలాలున్న నీలా రాజేంద్రకు అత్యంత ప్రతిభావంతురాలిగా పేరుంది. ఆమెను ఎలాగైనా అట్టిపెట్టుకునేందుకు నాసా చివరిదాకా విఫలయత్నం చేసింది. అందులో భాగంగా నీలను జెట్ ప్రొపల్షన్ లేబోరేటరీ విభాగం డీఈఐ పదవి నుంచి తప్పించడమే గాక ఆమె హోదాను ‘టీమ్ ఎక్సలెన్స్ అండ్ ఎంప్లాయీ సక్సెస్ (టీఈఈఎస్)’విభాగం చీఫ్‌గా మార్చేసింది.
నీల కెరీర్ ప్రొఫైల్ నుంచి డీఈఐ బాధ్యతల నిర్వహణ తాలూకు రికార్డులను పూర్తిగా తొలగించింది. అయినా లాభం లేకపోయింది. ‘‘నీల ఇకపై మనతో పాటు పనిచేయబోరు. ఎంతో ఆవేదన నడుమ ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది’’అని జెట్ ప్రొపల్షన్ లేబొరేటరీ విభాగం డైరెక్టర్ లారీ లేసిన్ వెల్లడించారు. ‘‘నాసాకు నీల ఎనలేని సేవలందించారు. తన పనితీరుతో చెరగని ముద్ర వేశారు. అందుకు సంస్థ ఆమెకు ఎప్పటికీ రుణపడి ఉంటుంది. తనకు అంతా మంచే జరగాలని ఆశిస్తున్నాం’’అని సంస్థ సిబ్బందికి రాసిన ఈ మెయిల్‌లో పేర్కొన్నారు. టీఈఈఎస్‌ను మానవ వనరుల విభాగంలో విలీనం చేస్తున్నట్టు తెలిపారు. త్వరలో మరికొందరు ఉద్యోగులకు ఉద్వాసన తప్పదనేందుకు ఇది సంకేతమని భావిస్తున్నారు.
ఏమిటీ డీఈఐ
డీఈఐ అంటే డైవర్సిటీ, ఈక్విటీ, ఇంక్లూజన్. అమెరికాలోని జాతి, భాషాపరమైన మైనారిటీలు తదితరులకు ఉద్యోగాల్లో అవకాశాలు కల్పించడం దీని ఉద్దేశం. ఈ పథకం అమెరికన్లలో జాతి ఆధారంగా విభజనకు, వివక్షకు కారణమవుతోందని ట్రంప్ చాలాకాలంగా ఆరోపిస్తూ వచ్చారు. రెండోసారి అధ్యక్షుడు కాగానే ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలన్నింట్లోనూ డీఈఐ విభాగాలను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అంతకుముందు 2024లోనే బడ్జెట్ పరిమితులు, డీఈఐ నిబంధనల కారణంగా పలు విభాగాలకు చెందిన 900 మంది ఉద్యోగులను నాసా తొలగించాల్సి వచ్చింది. ఆ నిర్ణయంపై తీవ్ర దుమారం రేగింది కూడా. అయినా నీలను మాత్రం అప్పట్లో సంస్థ అట్టిపెట్టుకుంది. ట్రంప్ సర్కారు తాజా ఉత్తర్వులతో ఇప్పుడామెను తొలగించక తప్పలేదు.
– సాక్షి, నేషనల్ డెస్క్