అమెరికా నుంచి రష్యాకు నిషేధిత విమానయాన పరికరాలను అక్రమంగా ఎగుమతి చేయడానికి కుట్ర పన్నినందుకు సంజయ్ కౌశిక్ అనే 58 ఏళ్ల భారత జాతీయుడికి రెండున్నరేళ్ల జైలు శిక్ష పడింది. ఈ వారం ప్రారంభంలో ఈ తీర్పు వెలువడగా, సంజయ్ కౌశిక్ చర్యలు “ఉద్దేశపూర్వకం, దురాశతో కూడివని ఒరెగాన్ యు.ఎస్. అటార్నీ స్కాట్ బ్రాడ్‌ఫోర్డ్ పేర్కొన్నారు.
ఢిల్లీకి చెందిన కౌశిక్ 2023 సెప్టెంబర్‌లో ఇతరులతో కలిసి రష్యన్ సంస్థల కోసం అమెరికా నుండి ఏరోస్పేస్ వస్తువులు, సాంకేతికతను చట్టవిరుద్ధంగా పొందడానికి కుట్ర పన్నాడు. కౌశిక్, అతని సహచరులు ఒరెగాన్‌లోని సరఫరాదారు నుండి విమానాల కోసం నావిగేషన్, ఫ్లైట్ కంట్రోల్ డేటా అందించే పరికరం ‘యాటిట్యూడ్ అండ్ హెడింగ్ రిఫరెన్స్ సిస్టమ్’(AHRS)కొనుగోలు చేశారు.
వాణిజ్య శాఖ అనుమతి లేకుండా ఇటువంటి పరికరాలను రష్యా వంటి కొన్ని దేశాలకు ఎగుమతి చేయడం చట్టవిరుద్ధం. లైసెన్స్ పొందేందుకు, కౌశిక్ తన భారతీయ కంపెనీ తుది కొనుగోలుదారు అని, పరికరాన్ని పౌర హెలికాప్టర్లలో ఉపయోగిస్తారని తప్పుడు వాదనలు చేశారు.
కౌశిక్, అతని సహచరులు ఏహెచ్‌ఆర్‌ఎస్ పరికరాన్ని కొనుగోలు చేసిన తర్వాత, దాన్ని ఎగుమతి చేయకముందే అధికారులు పట్టుకున్నారు. 2024 అక్టోబర్‌లో మయామిలో కౌశిక్ అరెస్ట్ అయ్యారు. అప్పటి నుండి కస్టడీలో ఉన్నారు.


