
ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టీకరణ
మాలె: మాల్దీవులతో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకొనేందుకు కట్టుబడి ఉన్నామని భారత ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను కొత్త శిఖరాలకు చేర్చడానికి కృషి చేస్తున్నామని చెప్పారు. మాల్దీవుల సర్వతోముఖాభివృద్ధికి సహకారం కొనసాగిస్తామని ప్రకటించారు.
ఇక్కడి ప్రజల ఆకాంక్షల సాకారానికి తమ మద్దతు ఎప్పటికీ ఉంటుందని హామీ ఇచ్చారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ శనివారం మాల్దీవుల ఉపాధ్యక్షుడు ఉజ్ హుస్సేన్ మొహమ్మద్ లతీఫ్‌తోపాటు పలువురు ముఖ్య నాయకులను కలుసుకున్నారు. మౌలిక సదుపాయాలు, టెక్నాలజీ, ఇంధనం, వాతావరణ మార్పుల నియంత్రణ సహా పలు కీలక రంగాల్లో పరస్పర సహకారంపై అతీఫ్‌తో చర్చించారు.
మాల్దీవుల స్వాతంత్య్ర దినోత్సవంలో మోదీ
ప్రధాని మోదీ మాల్దీవుల 60వ స్వాతంత్య్ర దినోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రిపబ్లిక్ స్క్వే ర్‌లో 50 నిమిషాలపాటు ఈ వేడుకలు జరిగాయి. మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జుతోపాటు భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, విదేశాంగ మంత్రి విక్రమ్ మిస్రీ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మిలటరీ పరేడ్, సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా అలరించాయి.