అమెరికాలో పౌరురాలి పట్ల ఇమిగ్రేషన్ అధికారుల అమానవీయ ప్రవర్తన
కారులో ఆసుపత్రికి వెళ్తుండగా బలవంతంగా బయటకు లాగి అరెస్టు
వాషింగ్టన్: అమెరికాలో ఒక మహిళను ఇమిగ్రేషన్ అధికారులు కారులోనుంచి బలవంతంగా బయటకు లాగి అరెస్టు చేసి, చేతులు పట్టుకొని బరబరా ఈడ్చుకెళ్లడం సంచలనం సృష్టిస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన పట్ల అధికారులు దారుణంగా ప్రవర్తించారని బాధితురాలు ఆవేదన వ్యక్తంచేశారు. అలియా రెహ్మాన్(42) అమెరికా పౌరురాలు. ఇక్కడే జన్మించారు. మిన్నెపొలిస్ నగరంలో నివసిస్తున్నారు.
చాలారోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజూరీ సెంటర్‌లో చికిత్స కోసం ముందే అపాయింట్‌మెంట్ తీసుకున్నారు. మంగళవారం కారులో అక్కడికి బయలుదేరారు. మధ్యలో ముఖాలకు మాస్క్‌లు ధరించిన ఇమిగ్రేషన్ ఏజెంట్లు అడ్డుకున్నారు. ఆమె కూర్చున్నవైపు కారు అద్దం పగులగొట్టారు. సీటు బెల్ట్‌ను కట్ చేశారు. డ్రైవర్ సీటు గుండా ఆమెను బయటకు లాగారు. కాళ్లు చేతులు పట్టుకొని ఈడ్చుకెళుతూ తమ వాహనంలోకి ఎక్కించారు.
డిటెన్షన్ సెంటర్‌కు తరలించారు. ఆసుపత్రికి వెళ్లాల్సి ఉందని, వదిలిపెట్టాలని రోదిస్తూ వేడుకున్నా కనికరించలేదు. కనీసం చికిత్స అందించే ఏర్పాటు కూడా చేయలేదు. దాంతో బాధితురాలు చాలాసేపు స్పృహ కోల్పోయారు. చివరకు ఆమెను ఆసుపత్రికి తరలించారు. తాను ఇప్పటికీ బతికి ఉండడం అదృష్టంగా భావిస్తున్నానని అలియా రెహ్మానచెప్పారు.
ఒక జంతువును ఈడ్చుకెళ్లినట్లుగా తనను ఈడ్చుకెళ్లారని ఆవేదన వ్యక్తంచేశారు. మిన్నెపొలిస్‌లో అక్రమ వలసదారులపై ఇమిగ్రేషన్ అధికా రులు ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. వారిని గుర్తించడానికి విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. అనుమానితులను డిటెన్షన్ కేంద్రాలకు తరలించి ప్రశి్నస్తున్నారు. మరోవైపు వలసదారులకు మద్దతుగా ఆందోళనలు జరుగుతున్నాయి.


