ఇరాన్‌ అణు కేంద్రాలను తనిఖీ చేస్తాం | IAEA chief says inspectors will visit nuclear sites under Iran-U.S. interim deal | Sakshi
Sakshi News home page

ఇరాన్‌ అణు కేంద్రాలను తనిఖీ చేస్తాం

Jun 25 2026 1:27 AM | Updated on Jun 25 2026 1:27 AM

IAEA chief says inspectors will visit nuclear sites under Iran-U.S. interim deal

ఐఏఈఏ చీఫ్‌ రఫేల్‌ మారియానో గ్రోసీ ప్రకటన  

ఖండించిన ఇరాన్‌ మంత్రి ఘరిబాబాదీ  

తుది ఒప్పందం తర్వాతే అనుమతిస్తామని వెల్లడి  

టోక్యో: ఇరాన్‌లో అణ్వాయుధ కేంద్రాల తనిఖీ వ్యవహారంపై పీటముడి పడింది. అమెరికా, ఇరాన్‌ మధ్య ఇటీవల కుదిరిన మధ్యంతరం ఒప్పందంలో భాగంగా ఇరాన్‌ అణు కేంద్రాలను తమ ప్రతినిధులు సందర్శించబోతున్నారని ఐక్యరాజ్యసమితికి చెందిన అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ(ఏఐఈఏ) చీఫ్‌ రఫేల్‌ మారియానో గ్రోసీ ప్రకటించగా, ఇరాన్‌ ఖండించింది. తుది ఒప్పందం కుదిరేదాకా తమ అణు కేంద్రాల సందర్శనకు అనుమతి ఇచ్చే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టింది. 

ఇరాన్‌ అణు శుద్ధి కేంద్రాలను తనిఖీ చేయాల్సి ఉందని రఫేల్‌ మారియానో గ్రోసీ చెప్పారు. ఆయన బుధవారం జపాన్‌లో మీడియాతో మాట్లాడారు. అణు కేంద్రాల తనిఖీ అంశాన్ని అమెరికా–ఇరాన్‌ మధ్యంతర ఒప్పందంలో చేర్చినట్లు తెలిపారు. 2025లో ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ 12 రోజులపాటు యుద్ధం చేసింది. అప్పటి నుంచి తమ యురేనియం శుద్ధి కేంద్రాలను సందర్శించకుండా ఐఏఈఏను ఇరాన్‌ అడ్డుకుంటోంది. దాదాపు 10 అణ్వాయుధాలను తయారు చేయడానికి సరిపడా అత్యధిక స్థాయి శుద్ధి చేసిన యురేనియం ప్రస్తుతం ఇరాన్‌ వద్ద ఉన్నట్లు సమాచారం. 

తమ అణు కార్యక్రమం శాంతియుతమైనదేనని ఇరాన్‌ వాదిస్తోంది. అమెరికా, ఇరాన్‌ అధ్యక్షులు సంతకాలు చేసిన అవగాహనా ఒప్పందం(ఎంఓయూ) ప్రకారమే తాము తనిఖీలు చేయబోతున్నామని గ్రోసీ తేల్చిచెప్పారు. ఇరాన్‌ చేపట్టే అణు కార్యకలాపాలను ఏఐఈఏ పర్యవేక్షిస్తుందని ఆ ఒప్పందంలో పేర్కొన్నట్లు గుర్తుచేశారు. తనిఖీ ఎప్పుడు జరుగుతోందో చెప్పలేనని అన్నారు. ఇరాన్‌ వద్దనున్న యురేనియం నిల్వలను అత్యధికంగా శుద్ధి చేసిన స్థాయి నుంచి తక్కువ శుద్ధిచేసిన స్థాయికి మార్చాలని ఒప్పందం నిర్దేశిస్తోంది. ఇది జరగాలంటే తనిఖీలు తప్పనిసరి అని గ్రోసీ పేర్కొన్నారు.  

తనిఖీలు ఇప్పుడే కాదు: ఇరాన్‌ 
ఐఏఈఏ చీఫ్‌ గ్రోసీ ప్రకటనను విదేశాంగ శాఖ ఉప మంత్రి కజెమ్‌ ఘరిబాబాదీ బుధవారం తోసిపుచ్చారు. అమెరికా–ఇరాన్‌ల తుది ఒప్పందం తర్వాతే తమ అణు కేంద్రాల తనిఖీలు సాధ్యమవుతాయని స్పష్టంచేశారు. గ్రోసీతో ఎటువంటి సమావేశం జరగలేదని అన్నారు. అమెరికా దాడికి గురైన తమ అణు కేంద్రాలను లేదా అణు పదార్థాలను పరిశీలించేందుకు ప్రస్తుతం ఎటువంటి ప్రణాళిక లేదని వెల్లడించారు. ఈ అంశాలు కేవలం ఒక తుది ఒప్పందం పరిధిలోనే ఉంటుందన్నారు. అలాగే ఇరాన్‌పై అన్ని ఆంక్షలను తొలగించే దిశగా అవతలి పక్షం తీసుకునే ఆచరణాత్మక చర్యలను బట్టి తమ ప్రతిస్పందన ఉంటుందని వివరించారు.   
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement