పాక్‌ రైలు హైజాక్‌.. కొనసాగుతున్న రెస్య్కూ ఆపరేషన్‌ | Hostages Rescued From Hijacked Jaffar Express Train In Pakistan, Watch Video Inside | Sakshi
Sakshi News home page

Pakistan Train Hijack: పాక్‌ రైలు హైజాక్‌.. రెస్య్కూలో పాకిస్థాన్‌ ఆర్మీ ప్లాన్‌ సక్సెస్‌!

Mar 12 2025 7:56 AM | Updated on Mar 12 2025 11:05 AM

Hostages Rescued From Hijacked Jaffar Express train In Pakistan

ఇస్లామాబాద్‌: దాయాది దేశం పాకిస్థాన్‌లో వేర్పాటువాద బలోచ్‌ మిలిటెంట్లు చెలరేగిపోయారు. ప్రయాణికుల రైలు జాఫర్‌ ఎక్స్‌ప్రెస్‌(Jaffar Express)పై దాడికి దిగి, హైజాక్‌ చేశారు. ఈ క్రమంలో భద్రతా సిబ్బందిని హతమార్చారు. అయితే రంగంలోకి దిగిన పాక్‌ భద్రతా బలగాలు.. కౌంటర్‌ ఆపరేషన్‌లో మిలిటెంట్లను మట్టు పెట్టాయి. 

తాజా సమాచారం ప్రకారం.. సైన్యం జరిపిన కాల్పుల్లో  16 మంది రెబల్స్‌ మరణించారు. ప్రయాణికుల్లో 104 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. సైనిక హెలికాప్టర్లు, డ్రోన్ల ద్వారా బాంబు దాడులతో పాక్‌ సైన్యం ఈ ఆపరేషన్‌ నిర్వహిస్తోంది. మిగిలిన ప్రయాణీకులను కాపాడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అక్కడి అధికారులు తెలిపారు.

ఇదిలా ఉండగా.. పాకిస్తాన్‌లో బలూచీ వేర్పాటువాదులు మంగళవారం ఏకంగా ఒక ప్రయాణికుల రైలునే హైజాక్‌ చేసేశారు. ఇది తమ పనేనని నిషేధిత బలూచిస్తాన్‌ లిబరేషన్‌ ఆర్మీ (బీఎల్‌ఏ) ప్రకటించుకుంది. ‘500 మంది ప్రయాణికుల్లో కనీసం 30 మందిని కాల్చి చంపేశామని, 215 మందిని బందీలుగా పట్టుకున్నాం. మృతులతో పాటు బందీల్లో దాదాపుగా అంతా సైనికులే’ అని పేర్కొంది. దీంతో, బందీలను విడిపించేందుకు సైన్యం హుటాహుటిన రంగంలోకి దిగింది.

ఘటనా స్థలిని సైనిక హెలికాప్టర్లు పెద్ద సంఖ్యలో చుట్టుముట్టి బాంబు దాడులకు దిగాయి. దాంతో బీఎల్‌ఏ మండిపడింది. సైనిక చర్యను తక్షణం నిలిపేయకపోతే బందీలందరినీ చంపేస్తామంటూ పాక్‌ సర్కారును తీవ్రంగా హెచ్చరించింది. రాజకీయ ఖైదీలుగా నిర్బంధించిన బలూచీ నేతలు, కార్యకర్తలందరినీ 48 గంటల్లోపు బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్‌ చేసింది. లేదంటే తీవ్ర పరిణామాలు తప్పవని స్పష్టం చేసింది. దాంతో సైనిక చర్యకు షహబాజ్‌ షరీఫ్‌ ప్రభుత్వం తాత్కాలికంగా విరామం ప్రకటించింది.

బలూచిస్తాన్‌తో పాటు పరిసర ప్రావిన్సుల్లో ఎమర్జెన్సీ విధించారు. ఘటనను కవర్‌ చేయకుండా మీడియాపై ప్రభుత్వం ఆంక్షలు విధించినట్టు చెబుతున్నారు. ముష్కరులతో ఎలాంటి సంప్రదింపులూ ఉండబోవని అంతర్గత శాఖ మంత్రి మొహసిన్‌ నక్వీ ప్రకటించారు. బందీల్లో దాదాపు 80 మందిని విడిపించినట్టు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. మృతుల సంఖ్య 35 దాటిందన్నారు.

గ్రేటర్‌ బలోచిస్థాన్‌ ఏర్పాటే లక్ష్యం
పాకిస్థాన్‌లోని దాదాపు 44 శాతం భూభాగం తన సొంతమైన బలోచిస్థాన్‌ ప్రావిన్సులో చమురు, బొగ్గు, బంగారం, రాగి, సహజ వాయువు తదితర వనరులు పుష్కలంగా ఉన్నాయి. వీటి ఆదాయం పాక్‌ ఖజానా నింపుతోంది. కోటిన్నర జనాభా గల ఈ పర్వత రాష్ట్రంలో మాత్రం అత్యధిక పేదరికం ఉంది. 1947 నాటికి ఈ ప్రాంతం పలువురు స్థానిక పాలకుల అధీనంలో ఉండేది. వీరిలో శక్తిమంతుడైన అహ్మద్‌ యార్‌ ఖాన్‌ స్వతంత్ర బలోచ్‌ రాష్ట్రం కావాలని పట్టుబట్టారు. అలా చేస్తే బలోచిస్థాన్‌లో సోవియట్‌ యూనియన్‌ (రష్యా) తిష్ఠ వేస్తుందని బ్రిటిషర్లు ఆందోళన చెందారు. పాకిస్థాన్‌ సైన్యం బలోచ్‌ భూభాగంలోకి ప్రవేశించి ఒత్తిడి తీసుకురావడంతో 1948 మార్చి 27న అహ్మద్‌ యార్‌ ఖాన్‌ విలీనపత్రంపై బలవంతంగా సంతకం చేయాల్సి వచ్చింది. నాటి నుంచీ ఈ ప్రాంతంలో రగులుతున్న అసంతృప్తి నేటికీ చల్లారలేదు. ఈ నేపథ్యంలో 2000 సంవత్సరంలో పుట్టిందే ‘బలోచ్‌ లిబరేషన్‌ ఆర్మీ’ (బీఎల్‌ఏ). సహజ వనరులను కాపాడుకొని, గ్రేటర్‌ బలోచిస్థాన్‌ ఏర్పాటు చేసుకోవడమన్నదే వీరి లక్ష్యం. గత అయిదేళ్లుగా ఈ పోరాటం తన పంథా మార్చుకొని మిలిటెన్సీ బాట పట్టింది. సాయుధ పోరాటాలు చేస్తున్న వివిధ దళాలు ఏకమై ‘బలోచ్‌ నేషనల్‌ ఆర్మీ’ ఏర్పాటు చేశాయి. పాక్‌తోపాటు అమెరికా, బ్రిటన్‌ బీఎల్‌ఏను ఉగ్రసంస్థగా ప్రకటించాయి.

ఇలా జరిగింది..
దాదాపు 500 మంది ప్రయాణికులతో కూడిన జాఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ మంగళవారం ఉదయం 9 గంటలకు బలూచిస్తాన్‌లోని క్వెట్టా నుంచి పెషావర్‌కు బయల్దేరింది. బొలాన్‌ జిల్లాలో కొండ ప్రాంతంలో కనుమ సమీపంలో గుదలార్, పెరో కున్రీ ప్రాంతాల మధ్య 8వ నంబర్‌ టన్నెల్‌ సమీపంలో బీఎల్‌ఏ సాయుధులు అప్పటికే రైలు పట్టాలను పేల్చేసి మాటు వేశారు. అక్కడికి చేరుకుని అతి నెమ్మదిగా వెళ్తున్న రైలు ఒక్కసారిగా పట్టాలు తప్పింది. వెంటనే బలూచీ సాయుధులు భారీ సంఖ్యలో రైలును చుట్టుముట్టారు. నేరుగా ఇంజన్‌పైకి కాల్పులు జరపడంతో డ్రైవర్‌ తీవ్రంగా గాయపడ్డాడు.

రైలు ఆగిపోగానే మొత్తం 9 బోగీల్లోకీ చొరబడ్డారు. వారికి, రైల్లోని భద్రతా సిబ్బందికి మధ్య కాసేపు కాల్పులు జరిగాయి. అనంతరం రైలును బీఎల్‌ఏ సాయుధులు తమ అధీనంలోకి తీసుకుని సమీపంలోని టన్నెల్లోకి తరలించారు. ప్రయాణికుల్లో సాధారణ పౌరులు, మహిళలు, చిన్నారులను ఒకవైపు, సైనికులను మరోవైపు విడదీశారు. అనంతరం సైనికుల్లో 20 నుంచి 30 మందిని కాల్చి చంపారు. సాధారణ పౌరులను వదిలేశారు. 215 మందిని బందీలుగా చేసుకున్నారు. వారిలో అత్యధికులు పోలీసు, యాంటీ టెర్రరిజం ఫోర్స్, ఐఎస్‌ఐకు, సైన్యానికి చెందినవారే ఉన్నారు. వారంతా సెలవులపై స్వస్థలాలకు వెళ్తున్నారు అని స్థానిక మీడియా పేర్కొంది. ఘటనా స్థలిలో మొబైల్‌ నెట్‌వర్క్‌ వంటివేమీ లేకపోవడంతో రైల్లోని సిబ్బందితో ఎలాంటి కాంటాక్టూ వీలవడం లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దాడికి పాల్పడింది బీఎల్‌ఏలోని మజీద్‌ బ్రిగేడ్‌గా భావిస్తున్నారు. వారితో పాటు స్పెషల్‌ టాక్టికల్‌ ఆపరేషన్స్‌ స్క్వాడ్, ఫతే స్క్వాడ్‌ ప్రత్యేక విభాగాలు కూడా దాడిలో పాల్గొన్నట్టు బీఎల్‌ఏ ప్రకటించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement